అఫ్గానిస్తాన్‌కు అండగా ఉంటాం: జోబైడెన్

27 Jun, 2021 01:53 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ 

వాషింగ్టన్‌: అఫ్గానిస్తాన్‌ నుంచి తమ సేనలు వైదొలిగినా, తమ ప్రభుత్వం మాత్రం అఫ్గాన్‌ ప్రజలకు అండగానే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనికి హామీ ఇచ్చారు. అఫ్గాన్‌ ప్రజలు ఇకపై తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోనున్నారన్నారు. అఫ్గానిస్తాన్‌తో తమ బంధం స్ధిరంగా కొనసాగుతుందని వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ఆయన చెప్పారు. తమ సైన్యం వైదొలిగిందంటే, ఇకపై అఫ్గాన్‌కు మిలటరీ, రాజకీయ, ఆర్థిక సాయం కొనసాగించమని చెప్పినట్లుకాదన్నారు.

రెండు దశాబ్దాలుగా తమను కాపాడేందుకు అమెరికా సైన్యం రక్తం చిందించడంతోపాటు, ఎంతో ఆర్థిక సాయం అందించిందని అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు ఘని కొనియాడారు. బైడెన్‌ అధ్యక్షుడైన తర్వాత తొలిసారి వీరిరువురు భేటీ అయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 11నాటికి అఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యం వైదొలగడం పూర్తవుతుందని బైడెన్‌ చెప్పారు. ఇటీవల కాలంలో అఫ్ఘన్‌లోని పలు జిల్లాలను తాలిబన్లు ఆధీనం చేసుకుంటున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అఫ్ఘనిస్తాన్‌లో అందరి మధ్య ఐక్యత తేవడం కోసం తమ అధికారులు పాటుపడుతున్నారని బైడెన్‌ చెప్పారు. 2002 నుంచి అఫ్గాన్‌కు అమెరికా నుంచి దాదాపు 12,900 కోట్ల డాలర్ల సాయం అందింది.   

మరిన్ని వార్తలు