Kabul Airport Attack: రాకెట్‌ దాడులు తిప్పికొట్టాం.. ఆపరేషన్‌ కొనసాగుతోంది!

30 Aug, 2021 13:08 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

కాబూల్‌/వాషింగ్టన్‌: ముందుగా హెచ్చరించినట్లుగానే కాబూల్‌ ఎయిర్‌పోర్టులో ఐదు రాకెట్‌ దాడులు జరిగినట్లు అమెరికా ధ్రువీకరించింది. అయితే, క్షిపణి వ్యవస్థ ద్వారా వాటన్నింటినీ తిప్పికొట్టామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు రాయిటర్స్‌తో వ్యాఖ్యానించారు. అఫ్గనిస్తాన్‌లోని హమీద్‌ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం జరిగిన రాకెట్‌ దాడిని తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు.

సీ- ర్యామ్‌ డిఫెన్స్‌ సిస్టం ద్వారా వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందన్నారు. కాగా సీ- ర్యామ్‌ అనేది ఒక ఆటోమేటిక్‌ సిస్టం. ప్రత్యర్థి దాడులను పసిగట్టి మెషిన్‌ గన్‌ ద్వారా వాటిని ఛేదిస్తుంది. ఇరాక్‌, అఫ్గనిస్తాన్‌లలో ఉన్న అమెరికా బలగాలను రక్షణగా అగ్రరాజ్యం ఈ సిస్టంను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇక  అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణకు రేపటి(ఆగష్టు 31)తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పటికే వరుస పేలుళ్లకు పాల్పడి వందలాది మంది అఫ్గన్‌ ప్రజలతో పాటు 13 మంది అమెరికా సైనికులను బలిగొన్న ఐసిస్‌- కె(ఇస్లామిక్‌ స్టేట్‌- ఖోరసాన్‌) గ్రూపు మరోసారి దాడులకు తెగబడే అవకాశం ఉందని అగ్రరాజ్యం హెచ్చరించింది. సోమవారం ఈ మేరకు దాడులు జరగడంతో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది.

చదవండి: భయం భయంగానే ఇంటర్వ్యూ: దేశం వీడిన మహిళా జర్నలిస్టు

మరిన్ని వార్తలు