Afghanistan: 300 మంది తాలిబన్లు హతం..!

23 Aug, 2021 10:48 IST|Sakshi

పంజ్‌షీర్‌ లోయ ఆక్రమణకు యత్నించిన తాలిబన్లు

300 మంది తాలిబన్లను హతమార్చిన పంజ్‌షీర్‌ సైన్యం

అంతర్జాతీయ మీడియా వెల్లడి

కాబూల్‌‌: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న నాటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడే దేశం విడిచి పారిపోయాడంటే అక్కడ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అఫ్గన్‌ సైన్యం ఏమాత్రం ప్రతిఘటించకుండా తాలిబన్లకు లొంగిపోయింది. తాలిబన్ల రాక్షస పాలన గురించి తెలిసిన ఆ దేశ ప్రజలు.. అక్కడ నుంచి విదేశాలకు వలస వెళ్తున్నారు. అఫ్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లను.. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ మాత్రం కలవరపెడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. తమను సవాలు చేస్తున్న పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఆక్రమణకు యత్నించిన తాలిబన్లను.. పంజ్‌షీర్‌ సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్‌షీర్‌ సైన్యం ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. బాగ్లాన్‌, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఇక తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపు కదులుతున్నట్లు సమాచారం. అంతేకాక పలువురు తాలిబన్లను అరెస్ట్‌ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.(చదవండి: Afghanistan: తాలిబన్ల వెన్నులో వణుకు.. అఫ్గాన్‌ హీరో ఇతడే..!)

అయితే తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్‌షీర్‌ ప్రజలు ప్రకటించారు. పంజ్‌షీర్‌ లోయలోకి వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి పహారా ఏర్పాటు చేశారు. తాలిబన్లను ఎదుర్కొని.. వారిని ఢీకొడుతున్న పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబన్ల చెర నుంచి అఫ్గన్‌ను విముక్తి చేసేది అహ్మద్‌ షా మసూద్‌‌ నాయకత్వంలోని పంజ్‌షీర్‌ సైన్యమే అని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. 
చదవండి: అఫ్గన్‌ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..!

మరిన్ని వార్తలు