Afghanistan: విమానం నుంచి పడిపోయిన ఘటన: గుర్తింపు కార్డులు తీసుకుని చెప్పా పెట్టకుండా

19 Aug, 2021 15:14 IST|Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో ఇటీవల విమానం పైనుంచి ఇద్దరు కిందపడిన విషయం తెలిసిందే. ప్రపంచాన్ని మొత్తం ఆ ఘటన నివ్వెరపరిచింది. తాజాగా ఆ ఇద్దరి వ్యక్తుల వివరాలు తెలిశాయి. తాలిబన్ల పాలనలో తాము నరకం అనుభవిస్తామనే ఆందోళనతో ఆ ఇద్దరు హడావుడిగా విమానం ఎక్కారని సమాచారం. ఆ విమానం నుంచి మొత్తం ముగ్గురు కిందపడగా ఆ వీడియోలో మాత్రం ఇద్దరే కనిపించారు. తాజాగా వారిలో ఇద్దరి వివరాలు తెలిశాయి.
చదవండి: నరకయాతన.. విమానం నుంచి కిందపడిన ఇద్దరు అఫ్గన్‌లు
 
కిందపడిన ముగ్గురిలో ఇద్దరు రెజా (17), కబీర్‌ (16). వీరు సొంత అన్నదమ్ములు. వీరి కుటుంబంలో 8 మంది ఉంటారు. అయితే తాలిబన్లు తమ దేశాన్ని వశం చేసుకున్నారనే వార్త తెలుసుకున్న ఈ అన్నదమ్ములు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో కెనడా, అమెరికాలో అఫ్గన్‌ దేశస్తులకు ఆశ్రయిస్తున్నట్లు స్థానికులు మాట్లాడుకుంటుంటే వీరిద్దరూ విన్నారంట.

దీంతో వెంటనే కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా ఇంట్లోని గుర్తింపు కార్డులు పట్టుకుని కాబూల్‌లోని విమానాశ్రయానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ కదులుతున్న అమెరికా యుద్ధ విమానం ఎలాగైనా ఎక్కాలని భావించి అతికష్టంగా విమానం రెక్కపై ఎక్కి కూర్చున్నారు. ఎగిరిన తర్వాత విమానం పైనుంచి రెజా, కబీర్‌ ఇద్దరూ కిందపడిపోయారు. ఆ పడిపోతున్న వీడియో ప్రపంచాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. 

అయితే రెజా మృతదేహం విమానాశ్రయం సమీపంలోని ఓ భవనంపై పడి ఉంది. పైనుంచి కిందపడడంతో రెజా కాళ్లు, చేతులు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. విగతజీవిగా పడి ఉన్న రెజాను కుటుంబసభ్యులు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. మరో యువకుడు కబీర్‌ జాడ ఇంతవరకు తెలియరాలేదు. అతడి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ప్రజలు, అఫ్గాన్‌ సైన్యం తాలిబన్లపై నిరసనగళం వినిపిస్తన్నారు. నిరాయుధులైన ప్రజలను సాయుధ తాలిబన్లు చావబాదుతున్నారు. అఫ్గాన్‌ పరిణామాలపై ప్రపంచ దేశాలు ఏం చేయాలో సమాలోచనలు చేస్తున్నాయి.

చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’

మరిన్ని వార్తలు