Afghanistan Crisis: పాకిస్తాన్‌ వల్లే ఇదంతా.. ఇండియా మా ఫ్రెండ్‌..

24 Aug, 2021 17:43 IST|Sakshi

న్యూఢిల్లీ: తమ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడం వెనుక పొరుగు దేశమైన పాకిస్తాన్‌ హస్తం ఉందని అఫ్గనిస్తాన్‌ పాప్‌స్టార్‌ అర్యానా సయీద్‌ ఆరోపించారు. అఫ్గన్‌ ప్రభుత్వం తాలిబన్లపై చర్యలకు ఉపక్రమించిన ప్రతిసారీ, పాక్‌ ఏదో ఒక విధంగా జోక్యం చేసుకునేదన్నారు. భారత్‌ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమని, అఫ్గనీయులకు ఎంతో సహాయం చేసిందని ధన్యవాదాలు తెలిపారు. శరణార్థులను అక్కున చేర్చుకున్న భారత్‌.. తమ దేశానికి నిజమైన స్నేహితుడు అని కృతజ్ఞతాభావం చాటుకున్నారు. అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన నేపథ్యంలో అర్యానా దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. 

శాంతి స్థాపనకై కృషి చేయండి
ఈ క్రమంలో ఏఎన్‌ఐతో మాట్లాడిన ఆమె... తమ దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై తమ వంతు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌ తాలిబన్లను ఎలా ప్రోత్సహిస్తుందో పలు వీడియోల ద్వారా మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. పాక్‌లోనే తాలిబన్లు శిక్షణ పొందుతున్నారు.

అలాంటి ఎన్నో సాక్ష్యాలను చూసిన తర్వాతే నేను పాకిస్తాన్‌ను నిందిస్తున్నాను. ఇప్పటికైనా వారి తీరు మారాలి. అఫ్గనిస్తాన్‌ రాజకీయాల్లో, అంతర్గత విషయాల్లో పాక్‌ జోక్యం చేసుకోవడం మానేయాలి’’ అని అర్యానా చురకలు అంటించారు.

ఇండియా మా ట్రూ ఫ్రెండ్‌
ఇక భారత్‌ గురించి చెబుతూ.. ‘‘ఇండియా మాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటుంది. మా దేశ ప్రజలు.. ముఖ్యంగా శరణార్థుల పట్ల దయా హృదయం కలిగి ఉండటం గొప్ప విషయం. ఇండియాలో ఉన్న అఫ్గనిస్తాన్‌ ప్రజలు ఆ దేశం, అక్కడి మనుషుల గురించి ఎంతో గొప్పగా మాట్లాడేవారు. ఇండియాకు మేం ఎప్పటికీ కృతజ్ఞులుగానే ఉంటాం. అఫ్గన్‌ ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు చెబుతున్నా.

పొరుగుదేశాల్లో మాకున్న నిజమైన స్నేహితుడు ఇండియా మాత్రమే. ఇది నిజంగా నిజం’’ అని అర్యానా ఉద్వేగంగా మాట్లాడారు. కాగా 2015లో తాలిబన్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో గల ఓ స్టేడియంలో పాట పాడటం ద్వారా అర్యానా కట్టుబాట్లను తెంచి ధైర్యసాహసాలు కలిగిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక అఫ్గన్‌ స్త్రీ, అందునా హిజాబ్‌ ధరించకుండా స్టేడియంలో ప్రవేశించడం అప్పట్లో సంచలనంగా సృష్టించింది.

చదవండి: Afghanistan: నా సోదరిని దారుణంగా చంపేశారు: గోపాల్‌ బెనర్జీ

మరిన్ని వార్తలు