Taliban: సర్వ నాశనం చేశారు.. నా చిన్న కూతురు నేటికీ...

25 Aug, 2021 21:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం(క్రెడిట్‌: రాయిటర్స్‌)

న్యూఢిల్లీ: ‘‘తాలిబన్లు నలుగురు వ్యక్తులను చంపడం నా చిన్న కూతురు కళ్లారా చూసింది. అప్పటి నుంచి తను భయంతో వణికిపోతోంది. రాత్రుళ్లు నిద్రపోకుండా ఏడుస్తూనే ఉంది. మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం. ఇక్కడ తాలిబన్లు లేరని నేనెంతగా నచ్చచెప్పినా తన భయాన్ని మాత్రం పోగొట్టలేకపోతున్నాను’’ అంటూ ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అఫ్గనిస్తాన్‌ నుంచి భారత్‌కు శరణార్థిగా వచ్చిన అతడు.. తమలాగే మిగతా వాళ్లు కూడా క్షేమంగా దేశం విడిచి రావాలని ఆకాంక్షించాడు. 

అఫ్గనిస్తాన్‌ను గుప్పిట్లోకి తెచ్చుకున్న తాలిబన్లు ప్రజలపై ఆంక్షలు విధించడం సహా ఎదురించిన వారిపై దాడులకు పాల్పడతున్న నేపథ్యంలో ఎంతో మంది దేశం విడిచిపారిపోతున్నారు. ఈ క్రమంలో మహ్మద్‌ ఖాన్‌ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి భారత్‌కు వచ్చాడు. ఢిల్లీలో విమానం దిగిన అనంతరం పశ్చిమ బెంగాల్‌లో ఉన్న తన స్నేహితుడి ఇంటికి చేరుకున్న అతడు.. తాలిబన్ల రాకతో తమ జీవితాలు అస్తవ్యస్తమయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాబూల్‌లో ఇలాంటి భయానక పరిస్థితులు మళ్లీ వస్తాయని అస్సలు ఊహించలేదన్నాడు.

ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మహ్మద్‌ ఖాన్‌.. ‘‘నా కూతురు ఎప్పుడు మామూలు మనిషి అవుతుందో తెలియడం లేదు. తన కళ్ల ముందే తాలిబన్లు హత్యలు చేయడం చూసింది. కేవలం 60 వేల నగదు, కొన్ని సూట్‌కేసులతో ఇక్కడికి వచ్చాను. రాత్రికి రాత్రే నా జీవితం తలకిందులైంది. మరో బాధాకర విషయం ఏమిటంటే..  మా అమ్మానాన్న ఇంకా అఫ్గన్‌లోనే ఉన్నారు. వారితో పాటు మిగతా వాళ్లు కూడా త్వరగా దేశం విడిచి వెళ్లిపోతే బాగుండు.

గురువారం ఇక్కడికి మరో విమానం వస్తుందట. నా తల్లిదండ్రులు, సోదరులు కూడా భారత్‌ వచ్చేస్తే బాగుండు. భారత రాయబార కార్యాలయ అధికారులు నాకెంతగానో సహాయం చేశారు. తాలిబన్లు మా ఇంటికి వచ్చి బెదిరించారు. ఇళ్లంతా దోచుకున్నారు. షాపును పడగొట్టారు. సర్వం నాశనం చేశారు. వాళ్లు మా ఇంటి దగ్గరే ఉన్న సమయంలో భారత అధికారులు నన్ను కార్లో ఎక్కించుకుని సురక్షితంగా తీసుకువచ్చారు’’ అని ధన్యవాదాలు తెలిపాడు. తమ వాళ్లను కూడా ఇండియాకు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.  

చదవండి: ‘కాదంటే కాల్చి చంపి, శవాలతో శృంగారం చేస్తారు’
 Afghanistan Crisis: తాలిబన్లతో చర్చలు.. చైనా కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు