తాలిబన్‌పై ఫేస్‌బుక్‌ నిషేధం

18 Aug, 2021 03:51 IST|Sakshi

లండన్‌: తాలిబన్‌ ముఠాను ఉగ్రవాద సంస్థగా తాము పరిగణిస్తున్నట్లు సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ప్రకటించింది. తాలిబన్‌ ఉగ్రవాదులను సమర్థించే అన్ని రకాల సమాచారాన్ని(కంటెంట్‌) నిషేధిస్తున్నట్లు, దాన్ని తమ వేదిక నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. తాలిబన్లను సంబంధించిన సమాచారాన్ని పరిశీలించి, తొలగించడానికి అఫ్గానిస్తాన్‌ నిపుణులతో కూడిన బృందం తమ సంస్థలో ఉందని తెలిపింది. తాలిబన్లు చాలా ఏళ్లుగా తమ భావజాలం, సందేశాలను ప్రజలకు చేరవేయడానికి సోషల్‌ మీడియాను చురుగ్గా ఉపయోగించుంటున్నారు.

‘‘అమెరికా చట్టాల కింద తాలిబన్ల ముఠాను ఉగ్రవాద సంస్థగా నిర్ధారించారు. డేంజరస్‌ ఆర్గనైజేషన్‌ పాలసీల కింద మా సేవల నుంచి తాలిబన్లను నిషేధించాం. తాలిబన్లు నిర్వహించే, వారి తరపున నిర్వహించే ఫేస్‌బుక్‌ ఖాతాలను తొలగించాం. మా సోషల్‌ మీడియా వేదికలో వారిని ప్రశంసించడాన్ని, సమర్థించడాన్ని, వారి తరపున వాదించడాన్ని మేము నిషేధించాం’’ అని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి ఓ వార్తా సంస్థతో చెప్పారు. దేశాల ప్రభుత్వాలను గుర్తించడంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజాన్ని అనుసరిస్తామని చెప్పారు. తాలిబన్ల కంటెంట్‌పై నిషేధం ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో సైతం అమలవుతుందని వెల్లడించారు. అయితే, తాలిబన్లు వాట్సాప్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వాట్సాప్‌ యాజమాన్యం స్పందిస్తూ... తాలిబన్లకు సంబంధించిన ఖాతాలు ఏవైనా ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

>
మరిన్ని వార్తలు