Afghanistan: తాలిబన్ల దుశ్చర్య.. నిరసన చేస్తున్న మహిళలపై..

2 Oct, 2021 15:00 IST|Sakshi

కాబుల్‌: పరిపాలన పేరుతో తాలిబన్లు అఫ్గన్‌ ప్రజలపై పాల్పడుతున్న ఆకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల బాలకల విద్య పై కఠిన ఆంక్షలు విధిస్తూ వారిని పాఠశాలలోకి అనుమతించని సంగతి తెలిసిందే. తాజాగా కాబుల్‌లో కొందరు మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఆపేందుకు తాలిబన్లు తమదైన శైలిలో హింసాత్మక ధోరణిని ప్రదర్శించారు. స్థానికి మీడియా తెలిపిన వివరాల ‍ప్రకారం.. 6-12 తరగతుల బాలికలను తిరిగి పాఠశాలలకు అనుమతించాలని ‘స్పాంటేనియస్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ అఫ్గాన్‌ వుమెన్‌ యాక్టివిస్ట్స్‌’ బృందానికి చెందిన కొందరు మహిళలు ఓ సెకండరీ స్కూల్‌ ముందు నిరసనకు దిగారు.

అందులో.. ‘మా పెన్నులు విరగ్గొట్టొద్దు. మా పుస్తకాలను కాల్చొద్దు. మా పాఠశాలలను మూసివేయొద్దని.. రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇంతలో అక్కడికి వచ్చని తాలిబన్లు వారిని వెనక్కి నెట్టి, ఆ బ్యానర్లు లాగేసుకున్నారు. నిరసన ఆపకపోయేసరికి వారిని అదుపుచేసేందుకు గాల్లో కాల్పులు సైతం జరిపారు. ఇదంతా రికార్డు చేస్తున్న విదేశీ జర్నలిస్ట్‌ను నిలువరించడమేగాక రైఫిల్‌తో అతన్ని కొట్టారు.

ఈ దుశ్చర్యకు పాల్పడిన బృందానికి నాయకుడైన మౌలావి నస్రతుల్లా మాట్లాడుతూ.. నిరసనకారులు తమ ప్రదర్శనకు సంబంధించి అనుమతులు తీసుకోలేదని వెల్లడిస్తూ, ఇతర దేశాల మాదిరిగానే తమ దేశంలో కూడా నిరసన తెలిపే హక్కు ఉందని అయితే అందుకు ముందస్తు అనుమతి తప్పనిసరిని తెలియజేశారు. అఫ్గాన్‌లో 6-12 తరగతులకు కేవలం బాలురను మాత్రమే అనుమతిస్తూ తాలిబన్లు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళల హక్కుల విషయంలోనూ వారు మొదటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నారు.

చదవండి: Pakistan: ట్రోలింగ్‌: అధికారుల ఫోన్లలో ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని మోగాల్సిందే..

మరిన్ని వార్తలు