ముల్లా ఒమర్.. ప్రపంచం మొత్తం చర్చించుకున్న.. చర్చిస్తున్న ఇస్లామిక్ రెబల్ గ్రూప్ ‘తాలిబన్’ అలియాస్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ వ్యవస్థాపకుడు. అయితే.. అఫ్గన్ గడ్డపై అమెరికా దళాల మోహరింపు తర్వాత ఆయన ఏమయ్యాడనే మిస్టరీ చాలా ఏళ్లు ఒక ప్రశ్నగా ఉండిపోయింది. చివరికి ఆయన సమాధి తొమ్మిదేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది.
తాలిబన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ ముల్లా ఒమర్.. 2001 దాకా ఆ సంస్థకు ఎమిర్(అధినేత)గా వ్యవహరించారు. అయితే అదే ఏడాది అఫ్గన్‌లో అమెరికా-నాటో దళాల మోహరింపు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2013 ఏప్రిల్‌లో ఆయన అనారోగ్యం పాలై మరణించినట్లు.. రెండేళ్ల తర్వాత తాలిబన్ సంస్థ ప్రకటించింది. అయితే ఆయన్ని ఎక్కడ ఖననం చేశారు? ఆ సమాధి ఎక్కడుందనే విషయాలపై తాలిబన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా పోయింది. ఈ తరుణంలో..
జబుల్ ప్రావిన్స్‌లోని సూరి జిల్లా దగ్గర ఒమర్జోలో ఆయన్ని ఖననం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యే ఆయన సమాధి వద్ద ఓ కార్యక్రమం నిర్వహించగా.. ఆదివారం తాలిబన్ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని అధికారికంగా వెల్డించారు. సమాధిని ధ్వంసం చేస్తారనే ఉద్దేశంతో.. ఇంతకాలం ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది తాలిబన్ గ్రూప్. ఇప్పుడు ఎలాంటి సమస్య లేకపోవడంతో విషయాన్ని బయటికి వెల్లడించారు.
కాందహార్‌లో పుట్టి పెరిగిన ఒమర్.. ఉన్నత చదువులతో అపర మేధావిగా గుర్తింపు పొందాడు. అయితే.. 1993లో అఫ్గనిస్థాన్ అంతర్యుద్ధం కారణంగా తాలిబన్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. తనను తాను స్వాతంత్ర సమరయోధుడిగా ప్రకటించుకున్న ఒమర్.. పాశ్చాత్య దేశాల తీరుపై విరుచుకుపడుతూ ఉండేవాడు. ఆయన హయాంలోనే తీవ్రవాద సంస్థగా ఎదిగిన తాలిబన్.. మహిళలపై కఠిన ఆంక్షలతో నరకరం చూపించింది.