Taliban Orders: మహిళా సిబ్బంది ఇళ్ల వద్దే ఉండాలి

20 Sep, 2021 08:28 IST|Sakshi
నిరసన తెలుపుతున్న అఫ్గన్‌ మహిళలు

కాబూల్‌ తాత్కాలిక మేయర్‌ ఆదేశం

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు మునుపటి నిరంకుశ విధానాలను ఒక్కటొక్కటిగా తెరపైకి తెస్తున్నారు. రెండు రోజుల క్రితం మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన తాలిబన్లు.. తాజాగా రాజధాని కాబూల్‌ పాలక సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఇళ్ల వద్దనే ఉండిపోవాలని హుకుం జారీ చేశారు. తాత్కాలిక మేయర్‌ హమ్దుల్లా నమోనీ ఆదివారం తన మొట్టమొదటి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

‘మహిళా సిబ్బందిని ప్రస్తుతానికి ఇళ్ల వద్దే ఉండిపోవాలని కోరాము. మరో ప్రత్యామ్నాయం లేనందున డిజైన్, ఇంజినీరింగ్‌ వంటి విభాగాలతోపాటు మహిళల టాయిలెట్ల వద్ద పనిచేసే వారిని మాత్రం విధులకు హాజరు కావాలని కోరాం’ అని అన్నారు. అయితే, మొత్తం సిబ్బందిలో ఎందరిని ఇళ్లకు పరిమితం చేసిందీ ఆయన వెల్లడించలేదు. కాబూల్‌ నగర పాలక సంస్థలో సుమారు 3 వేల మంది పనిచేస్తుండగా అందులో వెయ్యి మంది వరకు మహిళలున్నట్లు అంచనా.

కాగా, తాలిబన్ల నిర్ణయంపై ఉద్యోగినులు కాబూల్‌లో ఆదివారం నిరసన తెలిపారు. తమ హక్కులను తాలిబన్లు లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు స్వేచ్ఛ లేని సమాజం మృత సమాజంతో సమానమన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాయబార కార్యాలయాలు, నేతల ప్రైవేట్‌ నివాసాల వద్ద ఉన్న భద్రతా వలయాలను తొలగిస్తున్నట్లు మేయర్‌ హమ్దుల్లా తెలిపారు.  కాబూల్‌లో పౌరుల రక్షణకు తమదే బాధ్యతని చెప్పుకునేందుకు, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, మద్దతు చూరగొనేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. 

చదవండి:
కాబూల్‌ ఆత్మాహుతి బాంబర్‌ భారత్‌ అప్పగించిన వ్యక్తి 
అఫ్గన్‌ నిజమైన సంస్కృతి ఇదే.. ‘నా దుస్తుల జోలికి రావొద్దు’

మరిన్ని వార్తలు