Anarkali Kaur Honaryar: ఒక్కో మెసేజ్‌ చూస్తుంటే గుండె పగిలిపోతోంది

25 Aug, 2021 18:19 IST|Sakshi
అనార్కలీ కౌర్‌ హోనర్‌యార్‌(ఫొటో: ఏఎన్‌ఐ)

న్యూఢిల్లీ/కాబూల్‌: అనార్కలీ కౌర్‌ హోనర్‌యార్‌.. అఫ్గనిస్తాన్‌ ముస్లిమేతర, తొలి మహిళా ఎంపీ.. పురుషాధిక్య సమాజ కట్టుబాట్లను అధిగమించి బలహీనవర్గాల హక్కులు, అభ్యున్నతికి పాటుపడిన ధీశాలి. ఎంతో మంది మహిళలకు అండగా నిలిచిన ధైర్యవంతురాలు. అలాంటి వ్యక్తి ఇప్పుడు.. తాలిబన్ల అరాచకాలకు భయపడి ఎంతగానో ప్రేమించే మాతృదేశాన్ని విడిచారు. తనను, తన కుటుంబాన్ని కాపాడుకోవడం గుండెను దిటవు చేసుకుని శరణార్థిగా భారత్‌కు వచ్చారు. వస్తూ వస్తూ.. మాతృగడ్డ మీద నుంచి పిడికెడు మట్టి కూడా తెచ్చుకోలేకపోయానని కన్నీటి పర్యంతమవుతున్నారు.

డెంటిస్ట్‌ నుంచి ఎంపీగా..
వృత్తిరీత్యా దంతవైద్యురాలైన 36 ఏళ్ల అనార్కలీకి సమాజ సేవ చేయడం ఇష్టం. అందుకే రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా ఎన్నికై ప్రజలకు మరింత చేరువయ్యారు. కానీ.. ఎప్పుడైతే తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నారో అప్పటి నుంచి అనార్కలీ, ఆమె బంధువులకు కష్టాలు మొదలయ్యాయి. దేశం విడిచి వెళ్తేనే తప్ప మనుగడ సాగించలేని పరిస్థితి. దీంతో కొంతమంది కెనడా, యూరోప్‌నకు వెళ్లగా.. అనార్కలి తన కుటుంబంతో కలిసి ఆదివారం భారత్‌కు వచ్చారు.

భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ప్రస్తుతం ఓ హోటల్‌లో బస చేస్తున్న ఆమె.. జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘అఫ్గనిస్తాన్‌లో ప్రజాస్వామిక, అభ్యుదయ జీవితం గడిపే రోజులు వస్తాయని ఎంతగానో ఆశపడ్డాను. కానీ నా కలలు కల్లలైపోయాయి. దేశం విడిచే దుస్థితి వస్తుందని అస్సలు ఊహించలేకపోయాను. మాతృగడ్డను వదిలే సమయంలో కనీసం పిడికెడు మట్టి కూడా వెంట తెచ్చుకోలేకపోయాను’’ అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

చదవండి: పాకిస్తాన్‌ వల్లే తాలిబన్లు ఇలా.. భారత్‌ మా ఫ్రెండ్‌: పాప్‌ స్టార్‌

నన్ను నమ్మేవారు
‘‘మతాలకు అతీతంగా ముస్లిం మహిళలు నన్ను ఎంతగానో ఆదరించేవారు. నా మాటలను విశ్వసించేవారు. మానవ హక్కుల కమిషన్‌లో పనిచేశాను. ఎంతోమందికి అండగా ఉన్నాను. కానీ.. ఇప్పుడు దేశం విడిచి వచ్చేశాను. నా సహచరులు, స్నేహితులు కాల్స్‌ చేస్తున్నారు. మెసేజ్‌లు పంపుతున్నారు. వారికి ఏమని సమాధానం చెప్పను. ఒక్కో మెసేజ్‌ చూస్తుంటే నా గుండె పగిలిపోతోంది. ఏడుపొస్తోంది.

ఢిల్లీలో నేను సురక్షితంగా ఉన్నానని వారు సంతోషిస్తున్నా.. వాళ్లను విడిచి వచ్చినందుకు ఎంతగానో బాధపడుతున్నాను’’ అని అనార్కలీ తన బాధను పంచుకున్నారు. అఫ్గన్‌ను వీడినా.. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, వారితో గడిపిన మధుర క్షణాలు ఎల్లప్పుడూ తన మదిలో పదిలంగా ఉంటాయని ఉద్వేగానికి గురయ్యారు. 

చదవండి: ‘కాదంటే కాల్చి చంపి, శవాలతో శృంగారం చేస్తారు’

మరిన్ని వార్తలు