Panjshir: పంజ్‌షీర్‌ను జయించామన్న తాలిబన్లు.. అదేమీ లేదన్న తిరుగుబాటు దళం

4 Sep, 2021 13:31 IST|Sakshi

పంజ్‌షీర్‌ వశం, అఫ్గాన్‌పై పూర్తిపట్టు: తాలిబన్లు

దాడులను ఎదుర్కొన్నాం.. పంజ్‌షీర్‌ మా అధీనంలోనే: తిరుగుబాటు దారులు    

సెలబ్రిటీ కాల్పుల్లో 17 మంది మృతి చెందినట్టు వార్తలు

కాబూల్‌: అప్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు పంజ్‌షీర్‌పై పట్టు సాధించేందుకు తీవ్రంగా  ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా అక్కడి తిరుగుబాటుదారులు  పోరాటం చేస్తున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజాగా మరిన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

పంజ్‌షీర్‌ తమ స్వాధీనంలోకి  వచ్చిందని తాలిబన్లు తాజాగా సంచలన  ప్రకటన చేశారు.  అఫ్గాన్‌లోని చివరి ప్రావిన్స్ కాబూల్‌కు ఉత్తరాన ఉన్న పంజ్‌షీర్ లోయను కూడా వశం చేసకున్నామని తాలిబన్లు  ప్రకటించారు. ఈ ఆక్రమణతో అఫ్గానిస్తాన్‌ పై పూర్తి అధికారం సాధించామన్నారు.  ‘అల్లా దయతో అఫ్గానిస్తాన్‌ మొత్తం మా అధీనంలోకి వచ్చింది. తిరుగుబాటు దారులు ఓడిపోయారు. ప్రస్తుతం పంజ్‌షీర్‌ మా అధీనంలోనే ఉంది’ అని తాలిబన్ల కమాండర్‌ ఒకరు తెలిపారు. త్వరలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు  వెల్లడించారు.

చదవండి : Taliban-Kashmir: కశ్మీర్‌పై తాలిబన్ల సంచలన వ్యాఖ్యలు

విచిత్రమేమంటే రెండు వర్గాలు మేమే పై చేయి సాధించామని చెప్పుకుంటున్నాయి. పంజ్‌షీర్‌పై పట్టు సాధించామన్న తాలిబన్ల వాదనను అక్కడి తిరుగుబాటుదారులు కొట్టి పారేశారు. తాలిబన్లను తిప్పికొట్టామని ప్రకటించారు.  అలాగే  పంజ్‌షీర్‌ నుంచి పారిపోయాననే వాదనను అమ్రుల్లా సాలెహ్‌ తోసిపుచ్చారు. తాము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నామని చెప్పారు. రెండు వైపులా ప్రాణ  నష్టం వాటిల్లింది. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ తాలిబన్లకు లొంగేది లేదు. ఎప్పటికీ అఫ్గాన్‌ పక్షాన నిలబడి పోరాడతామని సాలెహ్‌ ప్రకటించారు. మరోవైపు కొన్ని వందల  తాలిబన్లు తమ వద్ద చిక్కుకున్నారనీ,  వారికి ఆయుధాల కొరత కారణంగా లొంగిపోయేందుకు చర్చలు కొనసాగిస్తున్నారని నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌  ప్రతినిధి అలీ నజారీ వెల్లడించారు. 

చదవండి: Elephant Water Pumping Video: ఈ ఏనుగు చాలా స్మార్ట్‌!

అటు పంజ్‌షీర్‌ను హస్తగతం చేసుకున్నాంటూ తాలిబన్లు రెట్టింపు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో పంజ్‌షీర్‌పై విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కాబూల్‌లో తాలిబన్లు గాల్లోకి కాల్పులుల్లో 17 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. చిన్నారులు సహా పలువురు మృతి చెందినట్లు స్థానిక ఆఫ్గన్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.
 

మరిన్ని వార్తలు