బయటపడిన బంగారు కొండ.. మట్టికోసం ఎగబడ్డ జనం 

11 Mar, 2021 03:12 IST|Sakshi

కాంగోలోని లుహిహి గ్రామంలో బయటపడ్డ బంగారు గని 

మట్టిని తవ్వుకునేందుకు కొండపైకి పోటెత్తిన జనం

కాంగో: కాంగోలోని బుకావుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ కివూ ప్రావిన్స్‌లోని ఓ కుగ్రామం లుహిహి. అక్కడి ప్రజలు తట్టా, బుట్టా చేతికి ఏది దొరికితే అది పట్టుకొని పక్కనే ఉన్న కొండపైకి పరుగులు పెడుతున్నారు. ఏంటి మట్టి కోసం అనుకుంటున్నారా? కానేకాదు. బంగారం తవ్వుకొచ్చుకునేందుకు. మరి ఆ కొండ మామూలు కొండ కాదు. అచ్చంగా బంగారు కొండ. అసలు మట్టిని కూడా వదిలిపెట్టని మనజనం. ఇక బంగారం కొండ దొరికితే వదులుతారా? అదే జరిగింది ఇక్కడ కూడా. ఇటీవలే రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలోని ఆ కుగ్రామంలో బంగారం గని బయటపడింది. ఆ కొండలోని 60 నుంచి 90 శాతం మట్టిలో బంగారం ఉన్నట్టు బయటపడింది.

అంతే దీంతో అక్కడి ప్రజలు పలుగు పారలు పట్టుకొని కొండమీదికి చీమల దండులా పాకేశారు మట్టిలో దాగివున్న బంగారు ఖనిజం కోసం. పలుగూ పారా ఉంటే సరే, ఏదీ లేకపోతే చేతుల్తోనే మట్టిని తోడేస్తున్నారట అక్కడి జనం. పలువురు గని ఉన్న ప్రాంతంలోని మట్టిని సంచుల్లో నింపేసుకున్నారు. కొందరేమో వాటిని ఇళ్ళల్లో కుప్పలు పోసుకుంటే, మరికొంత మంది అంతదూరం ఈ బరువెందుకు మోయాలనుకున్నారో ఏమో, అక్కడే నీళ్ళు పెట్టుకుని మట్టిని కడిగేసి, బంగారాన్ని సంచుల్లో నింపుకుంటున్నారు. ఈ వీడియోని అహ్మద్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంత మంతా ఇసుక వేస్తే రాలనంత జనం వెల్లువెత్తడంతో పాలకులకు చేసేదేం లేక తవ్వకాలపై నిషేధం విధించాల్సి వచ్చింది. 

మరిన్ని వార్తలు