వందేళ్ల తర్వాత న్యాయం.. తిరిగి వచ్చిన రూ.555 కోట్ల ఆస్తి

1 Oct, 2021 21:01 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తులు, డబ్బులు ఒకసారి మన చేయి జారిపోతే.. తిరిగి దక్కించుకోవడం చాలా కష్టం. మనకు ఎంతోకొంత అదృష్టం ఉండి.. ఎదుటివారి నిజాయతీపరులైతే తప్ప మన సొమ్ము మనకు దక్కదు. ఇప్పుడు మనం చదవబోయే వార్తలో బాధితులు అదృష్టంతులనే చెప్పవచ్చు. శతాబ్దం తర్వాత వారికి న్యాయం జరిగింది.

వందేళ్ల క్రితం కొందరు అమెరికా అధికారులు.. నల్లజాతీయుల కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించుకున్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆ నల్ల జాతీయుల కుటుంబానికి న్యాయం జరిగింది. అమెరికా అధికారులు ఆక్రమించిన భూమిని తిరిగి వారికి అప్పగించారు. ఇప్పుడు దాని విలువ 555 కోట్ల రూపాయలకు పైనే ఉంది. వందేళ్ల తర్వాత ఇంత విలువైన న్యాయం జరగడంతో ఆ కుటుంబం తెగ సంతోషపడుతుంది. ఆ వివరాలు.. 

సుమారు వందేళ్ల క్రితం అనగా 1900 సంవత్సరం ప్రారంభంలో తెల్ల జాతీయులకు, నల్ల జాతీయులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. జాత్యాంకార విద్వేషం రగులుతున్న సమయం. ఈ క్రమంలో దక్షిణ కాలిఫోర్నియాలో ఉంటున్న బ్రూస్‌ కుటుంబం మొదటి సారి నల్ల జాతీయుల కోసం ఆ ప్రాంతంలోని బీచ్‌లో 1912లో వెస్ట్‌కోస్ట్‌ రిసార్ట్‌ స్థాపించారు. దీనిలో లాడ్జ్, కేఫ్, డ్యాన్స్ హాల్, డ్రెస్సింగ్ టెంట్‌లు ఉన్నాయి. ఇక ఇది దక్షిణ కాలిఫోర్నియా ట్రేడ్‌మార్క్ బీచ్‌లలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం ఈ రిసార్ట్‌ మల్టీ మిలియన్ డాలర్ల విలువ చేసే ఇళ్ల సముదాయల మధ్యన ఉంది.
(చదవండి: డార్నెల్లా ఫ్రెజర్.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది!)

బ్రూస్‌ కుటుంబం ఇలా నల్ల జాతీయుల కోసం రిసార్ట్‌ స్థాపించడం నచ్చని శత్రువర్గీయులు.. దానికి నిప్పు పెట్టడానికి కూడా ప్రయత్నించారు. అంతేకాక 1920వ ప్రాంతంలో బ్రూస్‌ కుటుంబం నుంచి రిసార్ట్‌, అది ఉన్న స్థలాన్ని ఆక్రమించడం కోసం అక్కడ ఓ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మాన్హాటన్ బీచ్ సిటీ కౌన్సిల్ బ్రూస్‌ కుటుంబం నుంచి భూమిని సేకరించేందుకు ప్రముఖ డొమైన్‌ని ఆహ్వానించింది.
(చదవండి: జాత్యహంకారం.. కెమెరాకు చిక్కిన ప్లేయర్​)

అలా 1924 ప్రాంతంలో అక్రమంగా ఆక్రమించిన ఈ స్థలాన్ని ప్రస్తుతం అనగా సుమారు వందేళ్ల తర్వాత 2021లో తిరిగి బ్రూస్‌ వారసులకు తిరిగి అప్పగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన తప్పును సరిదిద్దే ప్రయత్నం ఇది అంటూ కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ట్వీట్ చేశారు. బ్రూస్ వారసులు, ఆ దంపతుల మునిమనడికి భూమిని పునరుద్ధరించడానికి అనుమతించే బిల్లుపై గవర్నర్ గావిన్ న్యూసమ్ సంతకం చేశారు. ప్రస్తుతం ఈ భూమి విలువ 75 మిలియన్‌ డాలర్లు(5,55,84,64,125 రూపాయలు). ఈ విషయం తెలిసిన నెటిజనులు.. ఇనేళ్ల తర్వాత అయినా  న్యాయం జరిగింది.. అది కూడా చాలా ఖరీదైన న్యాయం అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: జాత్యహంకారానికి టీకా లేదా?

మరిన్ని వార్తలు