ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన ప్రీతి పటేల్‌.. హోం మంత్రి పదవికి రాజీనామా, కారణం లిజ్‌ ట్రస్‌?

6 Sep, 2022 14:51 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ ఎన్నికైన వేళ.. అక్కడి రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బ్రిటన్‌ హోం మంత్రి(సెక్రటరీ) పదవికి ప్రీతి పటేల్‌(50) తన పదవికి రాజీనామా చేశారు. బోరిస్‌ జాన్సన్‌ నమ్మినబంటు అయిన ప్రీతి పటేల్‌.. లిజ్‌ ట్రస్‌ హయాంలోనూ బ్రిటన్‌ హోం సెక్రటరీగా కొనసాగుతారని భావించారంతా. అయితే.. 

పదవికి రాజీనామానే చేయాలని నిర్ణయించుకుని ఆమె కన్జర్వేటివ్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారారు. అంతేకాదు.. లిజ్‌ ట్రస్‌ నేతృత్వంలోని కేబినెట్‌లో తాను పని చేయబోనంటూ పరోక్షంగా ఆమె ప్రకటించారు కూడా. ఈ మేరకు ప్రధాని పీఠం నుంచి దిగిపోతున్న బోరిస్‌ జాన్సన్‌కు ఆమె ఓ లేఖ రాశారు. 

దేశ ప్రజలకు సేవ చేయాలనేది నా ఛాయిస్‌. లిజ్‌ ట్రస్‌ అధికారికంగా ప్రధాని పదవి చేపట్టగానే.. కొత్త హోం సెక్రటరీ నియమితులవుతారంటూ లేఖ రాసి ఆసక్తికర చర్చకు దారి తీశారామె. 

కన్జర్వేటివ్‌ పార్టీలో లిజ్‌ ట్రస్‌, ప్రీతి పటేల్‌కు పోసగదనే విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ సోమవారం సాయంత్రం లిజ్‌ ట్రస్‌ బ్రిటన్‌ అధ్యక ఎన్నికల్లో గెలిచారన్న ప్రకటన తర్వాత.. ప్రీతీ పటేల్‌, ట్రస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త ప్రధానికి అన్ని విధాల సహకారం అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు.. మూడేళ్లుగా హోం సెక్రటరీ బాధ్యతలు నిర్వహించడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారామె. దీంతో.. తర్వాతి హోం సెక్రటరీగా కూడా ఆమె కొనసాగుతారని అంతా భావించారు. అయితే లిజ్‌ ట్రస్‌ హయాంలో పని చేయడం ఇష్టం లేకనే ఆమె రాజీనామా చేసినట్లు.. ఆమె అనుచర వర్గం అంటోంది. 

భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌.. సుదీర్ఘకాలం బ్రిటన్‌ రాజకీయాల్లో కొనసాగారు. 1991లో పటేల్‌ కన్జర్వేటివ్‌ పార్టీలో చేరారు. 2010లో ఆమె తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కన్జర్వేటివ్‌ పార్టీలో ఆమె సీనియర్‌ సభ్యురాలిగా ఉన్నారు. 2019 నుంచి యూకేకు హోం సెక్రటరీగా పని చేశారు. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా సమయంలో ప్రధాని అభ్యర్థిత్వం రేసులో ఈమె పేరు కూడా బలంగా వినిపించింది. బోరిస్‌ నమ్మినబంటుగా, బ్రెగ్జిట్‌ క్యాంపెయిన్‌లోనూ పటేల్‌ క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే.. ప్రధాని అభ్యర్థి రేసు నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 

మరోవైపు లిజ్‌ ట్రస్‌ చేతిలో ఓడిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కు.. కేబినెట్‌ బెర్త్‌ దక్కడం అనుమానంగానే మారింది. అయితే రిషి సునాక్‌ మద్దతుదారులకు మాత్రం కేబినెట్‌లో ఛాన్స్‌ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: పుతిన్‌- కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చేతులు కలిపిన వేళ.. 

మరిన్ని వార్తలు