Earthquake In Afghanistan: అఫ్గనిస్తాన్‌లో మళ్లీ భూకంపం.. ఇంకా శవాల దిబ్బలుగానే..

23 Jun, 2022 11:32 IST|Sakshi

అఫ్గనిస్తాన్‌ భూకంపం.. సుమారు వెయ్యి మందికిపైనే పొట్టన పెట్టుకుంది. రాళ్లు, బురదతో కట్టుకున్న ఇళ్లు నేల మట్టం కావడంతో.. శిథిలాల కింద ఎంత మంది కూరుకుపోయారన్నది తెలియరావడం లేదు. తూర్పు ప్రాంతంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా.. మరణాల సంఖ్య భారీగానే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశానికి.. ప్రభుత్వానికి ప్రకృతి విలయం పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. 

మంగళవారం అర్ధరాత్రి దాటాక(1గం.30ని. సమయంలో) సంభవించిన భూకంపంలో.. వెయ్యి మందికి పైగా మరణించగా.. సుమారు పదిహేను వందల మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద ఎంతమంది సజీవ సమాధి అయ్యారన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో.. సహాయక చర్యలు కూడా ముందుకు సాగలేకపోతున్నాయి. ఖోస్ట్‌ ప్రావిన్స్‌ స్పెరా జిల్లాలో ఎక్కువ భాగం దెబ్బతింది. అలాగే పాక్‌టికా ప్రావిన్స్‌లోని బర్‌మలా, జిరుక్‌, నాకా, గియాన్‌ జిల్లాల్లో ఊళ్లకు ఊళ్లే దెబ్బతినగా.. గియాన్‌ జిల్లాలో ఘోరమైన ప్రాణ నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం సైతం అఫ్గనిస్థాన్‌లో భూకంపం సంభించింది. 

భారత కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో.. ఫజ్యాబాద్‌కు 76 కిలోమీటర్ల దూరంలో.. 163 కిలోమీటర్ల లోతున భూకంపం సంభించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదు అయ్యింది. ప్రకంపనలతో వణికిపోయిన ప్రజలు.. వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే నష్టం గురించి వివరాలు అందాల్సి ఉంది. 

ప్లీజ్‌.. సాయం చేయండి
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తాలిబన్‌ ప్రభుత్వం.. భూకంప నష్టం నేపథ్యంలో అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటోంది. వర్షం కారణంగా శిథిలాల తొలగింపు కష్టతరంగా మారుతోంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి తరపున షెల్టర్‌, ఆహార సదుపాయాలు నిరాశ్రయులకు అందడం మొదలైంది.

నేపాల్‌లోనూ భూకంపం
గురువారం ఉదయం నేపాల్‌లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.1, 4.9 తీవ్రతతో మధ్య నేపాల్‌ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కస్కీ జిల్లాలో ప్రజలు భయంతో రాత్రిపూట బయటకు పరుగులు తీశారు.

మరిన్ని వార్తలు