తీరు మార్చుకోని ట్రూడో.. మరోసారి కవ్వింపు చర్యలు

10 Oct, 2023 13:44 IST|Sakshi

ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీరు మారలేదు. మరోసారి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో జోర్డాన్ రాజుతో భారత్ సంబంధాలపై చర్చించారు. కెనడా-భారత్‌ మధ్య నెలకొన్న పరిస్థితులపై జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్-హుస్సేన్‌తో ఫొన్‌లో మాట్లాడారు. దౌత్య సంబంధాలలో వియన్నా కన్వెన్షన్‌ను గౌరవించడంపై చర్చించినట్లు ట్రూడో ఓ ప్రకటనలో తెలిపారు. 

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో ఇటీవలే యూఏఈ అధ్యక్షునితో కెనడా ప్రధాని ట్రూడో మాట్లాడారు. భారత్‌తో సంబంధాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ న్యాయనియమాలపై మాట్లాడినట్లు స్పష్టం చేశారు. అటు.. కొన్ని రోజుల ముందే యూకే ప్రధాని రిషి సునాక్‌తోనూ జస్టిన్ ట్రూడో మాట్లాడారు. భారత్‌తో కెనడాకు ఉన్న అంతర్జాతీయ సంబంధాలపై చర్చించారు. 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించింది.  అనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. అటు.. నిజ్జర్ హత్య కేసులో భారత్ సహకరించాలని కెనడా కోరుతోంది. సమస్యల పరిష్కారానికి ఇరుదేశాలు సమన్వయంతో పనిచేయాలని అమెరికా కూడా ఇప్పటికే స్పష్టం చేసింది.  

ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం

మరిన్ని వార్తలు