Air India Express Flight: ఎయిరిండియా విమానంలో కాలిన వాసన.. అత్యవసర ల్యాండింగ్‌!

17 Jul, 2022 19:59 IST|Sakshi

ఢిల్లీ: కాలికట్‌ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు అధికారులు. విమానం క్యాబిన్‌తో పాటు ప్రయాణికులు ఏదో కాలిపోతున్నట్లు వస్తున్న వాసనను గుర్తించారు. దీంతో బీ737-800 ఎయిర్‌క్రాఫ్ట్‌ వీటీ-ఏక్స్‌ఎక్స్ అనే విమానాన్ని అత్యవసరంగా మస్కట్‌ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) వెల్లడించింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు.. మస్కట్‌లో విమానం ల్యాండింగ్‌ చేసిన తర్వాత పరిశీలించగా.. ఎలాంటి మంటలు, పొగ, లీకేజీలు కనిపించలేదని అధికారులు తెలిపారు. 

'కాలిన వాసన వచ్చిన నేపథ్యంలో విమానాన్ని క్షణ్నంగా పరిశీలించాం. రెండు ఇంజిన‍్లతో పాటు ఏపీయూ యూనిట్‌లోనూ ఎలాంటి మంటలు, పొగ, కనిపించలేదు. ఇంధనం, ఆయిల్‌, హైడ్రోజన్‌ లీకైనట్లు సైతం కనిపించలేదు.' అని డీజీసీఏ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. రన్‌ వేపై విమానాన్ని అన్ని విధాల పరీక్షించినట్లు చెప్పారు. 

48 గంటల్లో నాలుగో సంఘటన.. 
సాంకేతిక సమస్యలతో విమానాన్ని దారి మళ్లించటం ఒకే రోజులో ఇది రెండో సంఘటన కావటం గమనార్హం. అయితే.. 48 గంటల్లో ఇది నాలుగో సంఘటన. ఆదివారం ఉదయం ఓ ఇండిగో విమానాన్ని అత్యవసరంగా పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్‌ చేశారు. యూఏఈలోని షార్జా నుంచి హైదరాబాద్‌ రావాల్సిన ఈ విమానంలో మార్గ మధ్యలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా కరాచీలో దించారు. భారత్‌కు చెందిన ఓ విమానం పాక్‌లో ల్యాండ్‌ కావడం గడిచిన రెండు వారాల్లో ఇది రెండోసారి. జులై 16న ఎథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అడిస్‌ అబాబా నుంచి బ్యాంకాక్‌కు వెళ్తుండగా.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. జులై 15న శ్రీలంకకు చెందిన విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా దించాల్సి వచ్చింది.

ఇదీ చూడండి: Indigo Flight Emergency Landing: కరాచీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

మరిన్ని వార్తలు