భారతీయ విద్యార్థులూ.. భయం వద్దు

26 Feb, 2022 05:47 IST|Sakshi
కీవ్‌లోని భారత ఎంబసీ వద్ద విద్యార్థుల పడిగాపులు

క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి కేంద్రం సన్నాహాలు 

రుమేనియా, హంగేరీ నుంచి తీసుకురావాలని నిర్ణయం

రెండు ప్రత్యేక విమానాలను బుకారెస్ట్‌కు పంపడానికి ఏర్పాట్లు  

కీవ్‌: రెండు రోజులైంది. తినడానికి తిండి లేదు, నిద్ర లేదు. తాగడానికి మంచినీరు కూడా దొరకడం లేదు. ప్రాణభయంతో బేస్‌మెంట్లలో తలదాచుకోవాల్సిన దుస్థితి. బాంబులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. రష్యా సేనలు పౌర నివాస ప్రాంతాలపైన కూడా బాంబుల వర్షం కురిపిస్తూ ఉండడంతో ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలర చేతుల్లో పెట్టుకొని ఉన్నారు. దేశం కాని దేశంలో యుద్ధ భయంతో భీతిల్లుతున్న తమ కన్న బిడ్డలకి ఎలాంటి ముప్పు వస్తుందో తెలీక భారత్‌లో ఉన్న తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు.

రెండు రోజులుగా తిండి, నిద్ర లేకుండా గడుపుతున్న విద్యార్థుల్ని  క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెండు ప్రత్యేక విమానాల్ని రుమేనియా రాజధాని బుకారెస్ట్‌కు పంపించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.  ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి బుకారెస్ట్‌కి చేరుకోగలిగే విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికి  అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా విదేశాంగ శాఖ అ«ధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికయ్యే ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థుల్ని బుకారెస్ట్‌ తీసుకురావడానికి కీవ్‌లో భారత రాయబార కార్యాలయం వారికి సహకారం అందిస్తుంది. రుమేనియా, హంగేరి నుంచి వారిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది. రుమేనియా, హంగేరి సరిహద్దు ప్రాంతాలైన చాప్‌ జహోని, చెర్నివిట్సికి సమీపంలో సిరెత్‌ సరిహద్దుల్లో నివసించే భారతీయులు ఒక క్రమ పద్ధతిలో చెక్‌ పాయింట్ల దగ్గరకు చేరుకోవాలని  రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.  భారతీయులందరూ ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది. పాస్‌పోర్టు, కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌తో పాటు అత్యంత అవసరమైన సామాన్లు మాత్రమే వెంట తీసుకురావాలని సూచించింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం 16 వేల మంది భారతీయులు చిక్కుకొని ఉంటే వారిలో అత్యధికులు విద్యార్థులే.  

8 కి.మీ. నడుచుకుంటూ
40 మంది భారతీయ వైద్య విద్యార్థులు నడుచుకుంటూ పోలండ్‌ సరిహద్దులకు చేరుకున్నారు. లివివ్‌ మెడికల్‌ కాలేజీలో చదువుకుంటున్న వారంతా 8కి.మీ.కు పైగా నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వచ్చారు. ఉక్రెయిన్‌ ఇరుగు        పొరుగు దేశాల నుంచి విద్యార్థుల్ని వెనక్కి     తీసుకురావడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో వీరంతా ప్రాణాలు దక్కించుకోవడానికి నడుచుకుంటూ వచ్చారు.

మరిన్ని వార్తలు