విమానంలో సాంకేతిక లోపం.. చుట్టూ సముద్రం.. చివరికి..

19 Apr, 2021 14:23 IST|Sakshi

ఫ్లోరిడా: సాధారణంగా మనం విమానం ల్యాండింగ్‌ అంటే నేల పైన ల్యాండ్‌ అయ్యే సమయంలో చూసుంటాం. మరి నీటి మీద ల్యాండ్‌ చేయడం ఎప్పడైనా చూశారా? ఇదేంటి కొత్త టెక్నాలజీతో విమానం ఏమైనా మార్కెట్‌లోకి వచ్చిందా అని ఆలోచిస్తున్నారా. అబ్బే అలాంటిది ఏం లేదండి ఎయిర్ షోలో పాల్గొన్న ఓ విమానం అత్యవసరంగా సముద్రంలో ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ల్యాండింగ్ జరుగుతుండంగా అక్కడి ప్రజలు ఈ సన్నివేశాన్ని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వింత ల్యాండింగ్‌ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడా ఎయిర్‌ షోలో ఒక అపశృతి చోటు చేసుకుంది. షోలో పాల్గొ‍న్న ఓ విమానం ఆకాశంలో ఉండగా అనుకోకుండా సాంకేతిక సమస్య రావడంతో అత్యవసర ల్యాండ్‌ చేయాలని ఆ విమాన పైలట్ భావించాడు. కాకపోతే ఎయిర్‌ షో జరుగుతున్న ప్రాంతం సముద్రం పక్కన ఉంది. ఇంకేముంది సమీపంలో ఎక్కడ కూడా నేల కనిపించలేదు. దీంతో ఆ పైలట్‌ చేసేదేమి లేక అత్యవసరంగా సముద్రంలో ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. తెలివిగా ఆలోచించిన పైలట్ తన నైపుణ్యాన్ని ఉపయోగించి సముద్రం ఒడ్డున విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేశాడు. ఈ క్రమంలో అక్కడ సేదతీరుతున్న ప్రజులు ఆశ్చర్యంగా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సముద్రంలో ల్యాండ్‌ చేసిన ఈ విమానం రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది. దీని పేరు టీబీఎం అవెంజర్, ఇది ఒక టార్పెడో బాంబర్. దీనిని రెండవ ప్రపంచ యుద్ధంలో యు.ఎస్. నేవీ ఉపయోగించింది. యు.ఎస్. నేవీ ఉపయోగం నుంచి రిటైర్ అయిన తరువాత, ఈ విమానం కాలిఫోర్నియాలోని డేవిస్లో 1956 నుండి 1964 వరకు యు.ఎస్. ఫారెస్ట్రీ సర్వీస్ ఫైర్ బాంబర్‌గా ఉపయోగించారు.

( చదవండి: నదిలో పొంగి పొర్లిన పాలు, కారణం తెలియక షాకైన ప్రజలు )

మరిన్ని వార్తలు