ఇంట్లో 10 లక్షల తేనెటీగలు ఉంటే ఎలా ఉంటుంది? ఈ గోళేంటి అనుకుంటున్నారా?

6 Jun, 2022 02:18 IST|Sakshi

మాంచి.. చెక్క ఇల్లు. చుట్టూ పచ్చని పొలం. ఆహ్లాదకరమైన వాతావరణం. సమయానికి ఫుడ్డు, పడుకోవడానికి బెడ్డు. వీటితోపాటు ఇంటి మధ్యలో పైన గ్లాస్‌ లాంటి డబ్బాలో దాదాపు 10 లక్షల వరకు తేనెటీగలు. ఎలా ఉంటుంది?.. అంటే అంతా బాగానే ఉంది కానీ.. మధ్యలో ఈ తేనెటీగలెందుకురా బాబూ అని అంటారు కదా! కానీ.. ఇటలీ, చుట్టుపక్కల దేశాల జనాలు మాత్రం ‘ఏమన్నా క్రియేటివిటా.. మేమొస్తాం. ఆ ఇంట్లో ఉంటాం’ అంటున్నారు.

తేనెటీగలే ఈ ఇంటికి ప్రత్యేకత మరి! ఇటలీలో తేనెటీగలను పెంచే రోకో ఫిలోమెనో ఈ ఇంటిని నిర్మించాడు. ఈసారి మే 20న జరిగే ‘వరల్డ్‌ బీ డే’ సందర్భంగా ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. నచ్చిన వాళ్లు వెకేషన్‌కు ఈ ఇంటికి రావొచ్చంటూ.. ఎయిర్‌బీఎన్‌బీ వెబ్‌సైట్‌ (హాలీడేకి వచ్చే వాళ్లకు ఇళ్లను అద్దెకిస్తుంటుంది)లో ఇంటిని లిస్ట్‌ చేశాడు.

వామ్మో తేనెటీగలు కుడితేనో అని భయపడకండి.. అవి కుట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు లెండి. ఈ చెక్క ఇంటిపైన కట్టిన గాజు బాక్సులో తేనెటీగలు కనిపిస్తుంటాయి. అవి చేసే శబ్దాన్ని వింటూ, అవి తమ కాలనీని ఎలా నిర్మించుకుంటున్నాయో చూస్తూ సందర్శకులు హాయిగా నిద్రపోవచ్చు.            
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌    

దక్షిణ ఇటలీలో.. 
దక్షిణ ఇటలీలోని గ్రొట్టోల్‌లో ఉన్న తన ఆలివ్‌ పొలంలో ఈ తేనెటీగల ఇంటిని రోకో నిర్మించాడు. డేవిడ్‌ టాగ్లియాబు అనే ఆర్టిస్టు ఇంటిని డిజైన్‌ చేయగా నిర్మాణానికి క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా డబ్బులను రోకో సమకూర్చాడు. స్థానిక వలంటీర్లు కూడా ఓ చెయ్యేశారు. పూర్తిగా కలప (ఫిర్, బిర్చ్‌ వుడ్‌)తో ఇంటిని నిర్మించారు. నిర్మాణానికి దాదాపు రూ. 13 లక్షలు ఖర్చయిందట. ఈ ఇంటిని బుక్‌ చేసుకున్న వాళ్లు రికోట్టా, స్ట్రాబెర్రీలు, ఇంట్లో తయారుచేసిన బిస్కెట్లతో పాటు తేనె రుచిని కూడా ఆస్వాదించొచ్చు.  

మరిన్ని వార్తలు