దేశం దాటి ప్యాసింజర్లకు సారీ చెప్పిన ఎయిర్‌లైన్స్‌ అధినేత

17 May, 2023 13:15 IST|Sakshi

ఇటీవల ఎయిర్‌లైన్స్‌ సంస్థల పేర్లు ఏదో ఒక రూపంలో తరచూ వార్తల్లో వినపడుతున్నాయి. సిబ్బంది లేదా ప్యాసింజర్ల ప్రవర్తన సరిగా లేకపోవడం కారణంగా పలు ఘటనలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. తాజాగా తమ సిబ్బంది చేసిన పనికి ఓ ఎయిర్‌లైన్స్‌ సంస్థ అధినేత దేశం దాటి వెళ్లి మరీ క్షమాపణలు చెప్పడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.  అసలేం జరిగిందంటే..

జపాన్‌ రాజధాని టోక్యో శివారులోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టార్‌లక్స్‌ JX803 విమానంలో ప్రయాణీకులు మొదట మే 6న మధ్యాహ్నం 3.45 గంటలకు ఎక్కవలసి ఉంది. సాయంత్రం 5.30 గంటలకు, బోర్డింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈలోగా, JX801 విమాన ప్రయాణీకులు కూడా వేచి ఉన్న JX803 ప్రయాణికులతో చేర్చారు. కొన్ని కారణాల వల్ల రెండు విమానాలను విలీనం చేస్తున్నట్లు స్టార్‌లక్స్ సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారు. చివరికి రెండు విమానంలోని ప్రయాణికులను ఒకదానిలో చేర్చారు. అయితే అందులోని సిబ్బంది పనివేళలు ముగియడంతో రెండో విమానం కూడా ఆలస్యమైంది.

చివరికి అర్ధరాత్రి అయ్యాక విమానం రద్దయిందని విమాన సిబ్బంది ప్రయాణికులకు తాపీగా చెప్పారు. దీంతో ప్రయాణీకులు ఆ రాత్రంతా విమానాశ్రయంలోనే గడపవలసి వచ్చింది. మరుసటిరోజు వీరిని మరో విమానంలో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్టార్‌లక్స్‌ ఎయిర్‌లైన్స్‌ ఛైర్మన్‌ చాంగ్‌ కు వీ హుటాహుటిన తైవాన్‌ నుంచి జపాన్‌కు బయలుదేరారు. మే 7వ తేదీ ఉదయం నరిటా విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులను స్వయంగా కలిసి క్షమాపణలు తెలియజేయడంతో పాటు వారి టికెట్‌ నగదును పూర్తిగా రీఫండ్‌ ఇస్తామన్నారు.

చదవండి: ‘మూన్‌ కింగ్‌’గా మళ్లీ శని గ్రహం.. 83 నుంచి 145కు చంద్రుల సంఖ్య

మరిన్ని వార్తలు