మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు..

13 Sep, 2021 04:43 IST|Sakshi

వీడియో విడుదల చేసిన అల్‌కాయిదా చీఫ్‌ అయమాన్‌

ఫుటేజీ తాజాది అని చెప్పలేం: సైట్‌ ఇంటెలిజెన్స్‌

బీరూట్‌: కొద్ది నెలల క్రితమే మరణించాడని భావిస్తున్న అల్‌ కాయిదా చీఫ్‌ అయమాన్‌ అల్‌ జవహిరి తిరిగి ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై అల్‌కాయిదా దాడులు జరిపి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్‌కాయిదా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన కనిపించాడు. ఈ విషయాన్ని జిహాదిస్టు వెబ్‌సైట్లను మానిటర్‌ చేసే సైట్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ వెల్లడించింది. వీడియోలో అయమాన్‌ అల్‌ జవహిరి జెరూసలేం గురించి, జనవరిలో రష్యన్‌ బలగాలపై సిరియాలో జరిగిన దాడుల గురించి ప్రస్తావించాడు. అమెరికా బలగాలు అఫ్గాన్‌ నుంచి వెళ్లిపోవడంపైనా  మాట్లాడాడు. తాలిబన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని మాత్రం  ప్రస్తావిచంలేదు.

దీంతో ఈ వీడియో జనవరి తర్వాత రికార్డు చేసి ఉండవచ్చని సైట్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ అభిప్రాయపడింది. 2020 ఫిబ్రవరిలోనే అమెరికా–తాలిబన్‌ల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో దాని గురించి మాట్లాడటాన్ని బట్టి వీడియో తాజాది అని చెప్పలేమని సైట్‌ పేర్కొంది. 2020 చివరలో ఆయన అనారోగ్యంతో మరణించి ఉంటాడని భావిస్తున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదలైంది. మొత్తం 61 నిమిషాల, 37 సెకెన్ల నిడివి ఉన్న వీడియో విడుదలైందని సైట్‌ డైరెక్టర్‌ రిటా కాట్జ్‌ తెలిపారు. 2021 జనవరి తర్వాత ఆయన మరణించి ఉండవచ్చని అన్నారు. 2011లో ఒసామాను అమెరికా హతం చేసిన అనంతరం ఈజిప్టుకు చెందిన నేత అయమాన్‌ అల్‌ జవహిరి ఆల్‌కాయిదా చీఫ్‌గా మారాడు. 

మరిన్ని వార్తలు