Algeria Wildfires: 25 మంది సైనికులు మృత్యువాత

11 Aug, 2021 07:49 IST|Sakshi

అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు

25 మంది సైనికులు, 17 మంది పౌరులు మృత్యువాత

కుట్రగా అనుమానిస్తున్న అధికారులు

అల్జీరియా : ఒకేసారి అటవీ ప్రాంతంలో అంటుకున్న దావానలం  ఘోర విషాదాన్ని నింపింది.  ఏకంగా 42 మంది అగ్నికి ఆహుతైన ఈ ఘటన కలకలం రేపింది. ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వీరిలో సహాయక చర్యల్లో ఉన్న 25మంది సైనికులతోపాటు మరో 17మంది పౌరులున్నారని అధికారులు తెలిపారు. మరో 14 మంది సైనికులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాజధాని అల్జీర్స్‌కి తూర్పున ఉన్న కబీలీ ప్రాంతంలోని అటవీప్రాంతమైన కొండలపై మంటలు, భారీగా పొగలు అలుముకున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఈ ఘోరంపై ప్రెసిడెంట్ అబ్దేల్‌మాద్జిద్ తెబ్బౌన్ తీవ్ర  సంతాపాన్ని ప్రకటించారు.  బాధిత  బెజియా, టిజి ఓజౌ ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు బలగాలను అప్రమత్తం చేశామని ఆయన ట్వీట్‌ చేశారు.  సైన్యాన్ని కూడా రంగంలోకి దించినట్టు వెల్లడించారు. సుమారు వంద మంది పౌరులను సైన్యం కాపాడిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు పెద్ద ఎత్తున చెలరేగిన  మంటలపై కుట్ర కోణాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఒకేసారి మంటలంటుకోవడం వెనుక క్రిమినల్స్‌ హస్తం తప్పక ఉండి ఉంటుందని  పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్‌ చేసినట్టు సమాచారం.

గ్రీస్, టర్కీ, సైప్రస్, పశ్చిమ అమెరికా సహా ఇటీవలి భారీ మంటల బారిన పడిన దేశాల  జాబితాలో అల్జీరియా చేరింది. సోమవారం రాత్రి నుంచి మంటలు చేలరేగడంతో అడవులు కాలిబూడిదవుతున్నాయి. దేశంలోని ఉత్తరాన ఉన్న 18 రాష్ట్రాల్లో 70కి పైగా ప్రదేశాల్లో మంటలు చెలరేగాయి, వీటిలో కబిలీలోని అత్యధిక జనాభా కలిగిన నగరాలు పది ఉన్నాయి. దావానలంలో వ్యాపించిన  అగ్నికీలలకు కబైలీ ప్రాంతంలోని ఆలివ్‌ చెట్లు పూర్తిగా నాశనమైపోయాయి. అనేక పశువులు, కోళ్లు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు  లోనయ్యారు.  మొత్తం కొండంతా మండుతున్న అగ్నిగోళంలా మారిపోయిందని,  ఒక్కసారిగా ప్రపంచం అంతమైపోతుందా అన్నంత భయపడ్డామంటూ ఆందోళన వ్యక్తం చేశారని స్థానిక మీడియా నివేదించింది. 

కాగా గత నెలలో అడవులకు నిప్పుపెట్టిన కేసుల్లో 30 సంవత్సరాల వరకు జైలుశిక్షతోపాటు, మరణ శిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష విధించే బిల్లును  జారీ చేశారు. జూలైలో, ఆరెస్ పర్వతాలలో 15 చదరపు కిలోమీటర్ల (ఆరు చదరపు మైళ్ళు) అడవి ధ్వంసానికి కారణమైన మానితులపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 2020 లో, దాదాపు 440 చదరపు కిలోమీటర్లు (170 చదరపు మైళ్ళు) అడవి అగ్నిప్రమాదానికి గురైంది. అనేక మందిని అరెస్టు చేశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు