జాక్‌ మాకు మరో షాక్‌!

2 Feb, 2021 14:19 IST|Sakshi

 మీడియా టాప్‌ బిజినెస్‌  లీడర్స్‌ జాబితా జాక్‌ మా తొలగింపు

బీజింగ్‌: చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు  జాక్ మాకు తాజాగా మరో షాక్‌ తగిలింది. దేశ అధికారిక రాష్ట్ర మీడియా ప్రచురించిన టాప్‌ బిజినెస్‌ లీడర్స్‌ జాబితా నుంచి అలీబాబాను తప్పించడం సంచలనం రేపింది. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన ప్రముఖ వ్యాపారవేత్తలను ప్రశంసించిన షాంఘై సెక్యూరిటీస్ పత్రిక కీలకమైన ప్రముఖ టెక్ దిగ్గజం అలీబాబాను విస్మరించింది.

చైనా ప్రభుత్వ మీడియా సంస్థ షింజువా ఏజెన్సీకి చెందిన షాంఘై సెక్యూరిటీస్ న్యూస్  దేశంలోని టెక్ దిగ్గజాలపై  స్టోరీ ప్రచురించింది. ఇందులో టెక్ సంస్థలు, టెక్ కంపెనీల అధినేతల కృషి, అభివృద్ధి గురించి ప్రముఖంగా పేర్కొంది. అయితే ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా, దాని వ్యవప్థాపకుడు జాక్ మా ప్రస్తావన లేదు. మరోవైపు  కొత్త మొబైల్‌ యుగాన్ని లిఖించాడంటూ జాక్ మా ప్రధాన ప్యత్యర్థి, టెన్సెంట్ సీఈవో పోనీమాపై ప్రశంసలు కురిపించడం విశేషం. టెన్సెంట్‌తో పాటు బివైడి కో చైర్మన్ వాంగ్ చవాన్ వూ, షావోమీ లీ జూన్, హువావే అధినేత తదితరులను పొగడ్తలతో ముంచెత్తింది. మొదటి పేజీ వ్యాఖ్యానంలో జాక్ మా పేరును ​కావాలనే  పక్కన పెట్టిన  పత్రిక "మన పాత ఆర్థిక వ్యవస్థ కఠినమైన విధానాలను బ్రేక్‌ చేయడానికి కొంతమంది వ్యవస్థాపకులు "నిర్లక్ష్య వీరులు"  గా వ్యవహరించా రంటూ రాసుకొచ్చింది. 

కాగా గతేడాది 2020 , అక్టోబర్ 24 వ తేదీన జాక్ మా చైనా ప్రభుత్వంపై కొన్ని విమర్శలు గుప్పించారు.  దీంతో  జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్  37 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,77,000 కోట్లు) ఐపీవోను నిలిపివేసిన చైనాప్రభుత్వం యాంట్‌ గ్రూపుతోపాటు అలీబాబాపై యాంటీ ట్రస్ట్ దర్యాప్తును ప్రారంభించింది. ఆ తరువాత నెలల తరబడి అజ్ఞాతంలో ఉన్న జాక్ మా, గతనెల జనవరిలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. 2019 లో అలీబాబా చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన అలీబాబా డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు.  అలీబాబా తన త్రైమాసిక ఆదాయాలను ఈ రోజు ప్రకటించనుంది. తాజా పరిణామంపై అలీబాబా ఇంకా  స్పందించలేదు.

మరిన్ని వార్తలు