Jeff Bezos: అంతరిక్షయాత్ర విజయం.. రూ.745 కోట్ల అవార్డు ప్రకటన

21 Jul, 2021 08:18 IST|Sakshi
అంతరిక్ష యాత్ర అనంతరం కరేజ్‌ అండ్‌ సివిలిటీ అవార్డు గ్రహీతలు జోస్‌ ఆండ్రెస్‌, వాన్‌ జోన్స్‌తో జెఫ్‌ బెజోస్‌

తొలి అవార్డు అందుకున్న వాన్‌ జోన్స్‌, జోస్‌ ఆండ్రేస్‌

వాషింగ్టన్‌: జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన న్యూషెపర్డ్ నౌక రోదసియాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే. భూమ్మీద ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మామూలే. కానీ భూ ఉపరితలాన్ని దాటి.. మనకు పూర్తిగా పరిచయం లేని మరో లోకంలో విహరించాలంటే ఆసక్తి, అభిమానంతో పాటు ఎంతో ధైర్యం కావాలి. అంతరిక్ష యాత్ర ద్వారా బెజోస్‌ సాహసం చేశారనే చెప్పవచ్చు. అవును మరి అంతరిక్షంలోకి ప్రయాణించి.. క్షేమంగా భూమ్మిదకు చేరడం అంటే మాటలు కాదు. 

అందుకే తన అంతరిక్ష యాత్ర విజయానంతరం జెఫ్‌ బెజోస్‌ కీలక​ ప్రకటన చేశారు. భూమ్మీదకు తిరిగి వచ్చిన తర్వాత ఓ భారీ అవార్డును ప్రకటించారు. ధైర్యం, పౌరసత్వం(కరేజ్‌ అండ్‌ సివిలిటీ) పేరుతో 100 మిలియన్‌ డాలర‍్ల (రూ. 7,46,09,40,000) అవార్డు ప్రకటించాడు. మానవ జాతి ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవటానికి ప్రజలను సమాయత్తం చేసే నాయకులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

తొలి అవార్డు విన్నర్‌ ఎవరంటే..
బెజోస్‌ ప్రకటించిన కరేజ్‌ అండ్‌ సివిలిటీ అవార్డును తొలుత ఇద్దరికి ప్రదానం చేశారు. వీరిలో ఒకరు అమెరికన్ రాజకీయ వ్యాఖ్యాత వాన్ జోన్స్, మన ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్ ఉన్నారు. వీరిద్దరికి 100 మిలియన్‌ డాలర్లు అందజేస్తారు. అంతరిక్ష యాత్ర విజయం అనంతరం జెఫ్‌ బెజోస్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘అవార్డు గెలుచుకున్న వాన్‌ జోన్స్‌, జోస్‌ ఆండ్రెస్‌ ఈ అవార్డు ద్వారా లభించే మొత్తాన్ని ఏదైనా లాభాపేక్షలేని కార్యక్రమం కోసం కానీ.. చాలామందికి పంచడానికి కానీ వినియోగించవచ్చని’’ తెలిపారు. భవిష్యత్తులో చాలామందికి ఈ అవార్డును ప్రదానం చేస్తామన్నారు. 

ఎవరీ జోస్‌ ఆండ్రెస్‌..
స్సానిష్‌కు చెందిన ప్రముఖ చెఫ్‌ జోస్‌ ఆండ్రెస్‌ ప్రముఖ మానవతావాదిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లాభాపేక్ష లేకుండా నిర్వహించే ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌’ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు జోన్‌ ఆండ్రెస్‌. 2010లో ప్రారంభించిన వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ ప్రపంచవ్యాప్తంగా పలు సహాయ సంస్థలతో కలిసి ప్రకృతి విపత్తుల బాధితులకు ఆహారం అందిస్తుంది. ప్రపంచ ఆకలిని తీర్చేందుకు వినూత్న ఆలోచనలను చేయడమే కాక.. స్థానిక చెఫ్‌లను వాటిలో భాగస్వామ్యం చేసేలా చేస్తుంది. 

వాన్‌ జోన్స్‌ ఎవరంటే..
వాన్‌ జోన్స్‌ ప్రముఖ టీవీ హోస్ట్‌, రచయిత, రాజకీయ విశ్లేషకుడు. అంతేకాక వాన్‌ జోన్స్‌ షో, సీఎన్‌ఎన్‌ రిడెమ్షన్‌ ప్రాజెక్ట్‌కి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లింగ్‌ అథర్‌గా మూడు సార్లు నిలిచారు. 2009లో బరాక్‌ ఒబామాకు ప్రత్యేక సలహదారుగా పని చేశారు. 

క్రిమినల్ జస్టిస్ సంస్కర్తగా ప్రశంసలు పొందిన జోన్స్ అనేక లాభాపేక్షలేని సంస్థలను స్థాపించారు. వాటిలో ముఖ్యమైనది ది డ్రీమ్ కార్ప్స్. డ్రీమ్ కార్ప్స్ అనేది ఇంక్యుబేటర్, ఇది సమాజంలో "అత్యంత హాని కలిగించేవారిని ఉద్ధరించడానికి,శక్తివంతం చేయడానికి" తగిన ఆలోచనలు, ఆవిష్కరణలకు మద్దతు ఇస్తుంది.

న్యూ షెపర్డ్‌ వ్యోమనౌకలో నలుగురు సభ్యులతో నింగిలోకి వెళ్లింది. సాయంత్రం 6.30 గంటలకు న్యూ షెపర్డ్‌ వ్యోమ నౌక నింగిలోకి దూసుకెళ్లింది. వ్యోమ నౌకలో జెఫ్‌ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్‌ బెజోస్‌, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు. 

మరిన్ని వార్తలు