అమెరికా పన్నాగం! భారత్‌ను పొగిడినట్లే పొగిడి.. ఇరకాటంలోకి నెట్టేస్తోందా?

18 May, 2022 20:05 IST|Sakshi

రష్యా-భారత్ ఆయుధ ఒప్పందాలకు అమెరికా మొదటి నుంచి వ్యతిరేకమే!. ఉక్రెయిన్‌ పరిణామాల తర్వాత ఆ బంధాన్ని ఏదో రకంగా తెంచాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది కూడా. అయినా భారత్‌ మాత్రం తటస్థ వైఖరితో అగ్రరాజ్యానికి సమాధానం ఇస్తూ వస్తోంది. ఈ తరుణంలో  ఎస్-400 క్షిపణుల కొనుగోలు అంశాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌ పొగిడినట్లే పొగుడుతూ ఇరకాటంలో నెట్టేసే ప్రయత్నం చేస్తోంది అ‍గ్రరాజ్యం. 

రష్యాతో భారత్‌ ఎస్‌-400 క్షిపణుల ఒప్పందాన్ని అమెరికా ముందు నుంచీ వ్యతిరేకిస్తోంది. ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటూ పదే పదే ఒత్తిడి తెస్తోంది. అయినా కూడా భారత్ వెనకడుగు వేయలేదు. తమ సార్వభౌమాధికారానికి తగ్గట్టుగా ఒప్పందాలు చేసుకుంటామని తేల్చి చెప్పింది. గత ఏడాది డిసెంబర్ నుంచే ఆ క్షిపణి వ్యవస్థలు మనకు చేరుతున్నాయి. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై అమెరికా స్పందించింది. 

చైనా, పాక్‌ ప్రస్తావనతో..
పొరుగున చైనా, పాకిస్థాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు ఈ ఏడాది జూన్ నాటికి సరిహద్దుల్లో ఆ క్షిపణులను మోహరించేందుకు భారత్ సిద్ధమవుతోందంటూ ఓ సంచలన ప్రకటన చేసింది అమెరికా. ఈ మేరకు ఆ దేశ రక్షణ కార్యాలయం పెంటగాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్.. ఒక ప్రకటన చేశారు. ఇటీవల నిర్వహించిన ఆర్మ్డ్‌డ్ సర్వీసెస్ కమిటీ సమావేశం సందర్భంగా స్కాట్‌.. భారత్ ఎస్ 400 మిసైల్స్ పై నివేదికను సమర్పించారు. భూ, జల సరిహద్దులను పటిష్ఠ పరచుకునేందుకు భారత్ ఈ మిసైళ్లను సమీకరించుకుంటోందని పేర్కొన్నారు. అంతేగాకుండా సైబర్ దాడులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని పెంచుకుంటోందని వివరించారు. ఇప్పటిదాకా బాగానే ఉంది. అయితే..

భూ, వాయు, సముద్ర హద్దులను కాపాడుకునేందుకు చైనా, పాక్‌లను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక ఆయుధాలను సిద్ధం చేసుకుంటోందని, న్యూక్లియర్ బలగాలనూ అభివృద్ధి చేసుకుంటోందని చేసిన ప్రకటనే భారత్‌ పొరుగున ఉన్న రెండు దేశాలను కవ్వించేందిగా ఉంది. ఇది ఆ రెండు దేశాల నుంచి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసే అంశాలే.  పైగా కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడుతూనే పాక్ నుంచి భారత్ లోకి ప్రవేశించే ఉగ్రవాదులకు సరైన రీతిలో జవాబిస్తోందని, 2020లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణలతో భారత్ – చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయంటూ.. ఉద్రిక్త అంశాలను మళ్లీ ప్రస్తావించడం కొసమెరుపు. ఇదిలా ఉంటే..  స్కాట్ బెరియర్ ప్రకటనను మాత్రం భారత్‌ తీవ్రంగానే పరిగణించినట్లు తెలుస్తోంది.

మచ్చిక కోసం ప్యాకేజీ
భారత్ ను రష్యాకు దూరం చేసే పన్నాగాలకు అమెరికా పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఆయుధాల కోసం రష్యాపై భారత్ ఆధారపడడాన్ని తగ్గించేలా చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా భారత్ కోసం 500 మిలియన్ (రూ.3,850 కోట్లు) డాలర్ల సైనిక సాయాన్ని ఆఫర్ చేయనుంది. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం ద్వారా భారత్ తో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అగ్రరాజ్యం అనుకుంటున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వర్గాలు తెలిపాయి. విదేశీ సైనిక సాయం కింద 500 మిలియన్ డాలర్లు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని.. ఇజ్రాయెల్, ఈజిప్ట్ తర్వాత ఈ తరహా సాయం అందుకునే అతిపెద్ద దేశం భారత్ అవుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ప్యాకేజీ ఎప్పుడు ప్రకటించేది చెప్పలేదు.

చదవండి: అమెరికాలో మళ్లీ ఆ టెన్షన్‌.. అక్కడ హై అలర్ట్‌ 

మరిన్ని వార్తలు