వ్యవసాయ చట్టాలకు అమెరికా మద్దతు

5 Feb, 2021 03:40 IST|Sakshi

వాషింగ్టన్‌ : కొత్త వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమానికి ఇంటా బయటా ఎందరో మద్దతునిస్తున్న వేళ భారత ప్రభుత్వానికి తాజాగా అగ్రరాజ్యం అమెరికా అండగా నిలిచింది. ఈ చట్టాలతో భారత్‌ మార్కెట్‌ బలపడుతుందని అభిప్రాయపడింది. రైతుల ఆందోళనల్ని చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించింది. శాంతియుతంగా చేసే నిరసనలు ప్రజాస్వామ్య దేశాల లక్షణమని పేర్కొన్న అమెరికా విదేశాంగ శాఖ సంక్షోభ నివారణకు తాము చర్చల్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేసింది.

ప్రైవేటు పెట్టుబడుల్ని ఆకర్షించేలా, రైతుల మార్కెట్‌ పరిధిని పెంచేలా వ్యవసాయ రంగంలో చేపట్టిన సంస్కరణలకి బైడెన్‌ ప్రభుత్వం మద్దతునిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు బుధవారం వెల్లడించారు. సాధారణంగా మార్కెట్లను బలోపేతం చేసే ఎలాంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని, భారత్‌లో వ్యవసాయ సంస్కరణల్ని తమ దేశం స్వాగతిస్తుందన్నారు. మరోవైపు కొందరు ప్రజాప్రతినిధులు రైతులకు సంఘీభావంగా ట్వీట్లు చేశారు.   

రైతు ఆందోళనల్ని భారత్‌ వైపు నుంచి చూడాలి
దేశంలో రైతు నిరసనల్ని పూర్తిగా భారత్‌ దృష్టి కోణంతో చూడాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ్‌ అన్నారు. ఈ దేశంలో రాజకీయాలను అర్థం చేసుకొని అభిప్రాయాలను వెల్లడించాలన్నారు. రైతులతో సమస్య పరిష్కారానికి పలు దఫాలు కేంద్రం చర్చలు జరిపిందన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నవంబర్‌ నుంచి నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులతో సమస్య పరిష్కారానికి చర్చల్ని తాము ప్రోత్సహిస్తామని అమెరికా విదేశాంగ శాఖ చేసిన సూచన పట్ల అనురాగ్‌ స్పందిస్తూ జనవరి 6న అమెరికాలో క్యాపిటల్‌ భవనంపై దాడి, జనవరి 26న ఎర్రకోటపై దాడిని ఒకేలా చూడాలన్నారు. క్యాపిటల్‌ భవనంపై దాడి సమయంలో అమెరికాలో ఎలాగైతే భావోద్వేగాలతో కూడిన ప్రతిస్పందనలు వచ్చాయో ఇక్కడ కూడా అలాగే వచ్చాయన్నారు. ఇక్కడ చట్టాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని చెప్పారు. హింస చెలరేగకుండా ఉండడానికే ఇంటర్నెట్‌ నిలిపివేశామని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు