అబార్ష‌న్ చ‌ట్టంపై అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

3 May, 2022 17:32 IST|Sakshi

వాషింగ్టన్‌: అబార్షన్ హక్కులపై అమెరికాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ముసాయిదా లీకవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఆందోళనకారులు వాషింగ్టన్‌ డీసీలోని సర్వోన్నత న్యాయస్థానం భవనాన్ని చుట్టుముట్టారు. తమ హక్కులను కాలరాయవద్దంటూ నినాదాలు చేశారు.

లీకైన ముసాయిదాలో ఏముందంటే..
అబార్షన్ హక్కులపై 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును జస్టిస్ శామ్యూల్ ఆలిటో రద్దు చేస్తున్నట్టు లీకైన ముసాయిదాలో ఉంది. రో వ‌ర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన వివ‌ర‌ణ చాలా బ‌ల‌హీనంగా ఉంద‌ని, దాని ప‌రిణామాలు ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌ట్లు జ‌స్టిస్ అలిటో అభిప్రాయ‌ప‌డ్డారు. న్యాయ‌మూర్తులు ఇస్తున్న తీర్పు స‌రిగా లేద‌ని లీకైన డాక్యుమెంట్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

అబార్షన్ హక్కులపై తీర్పు లీకైన స‌మాచారంపై సుప్రీంకోర్టు కానీ వైట్‌హౌజ్ కానీ ఇంతవరకు స్పందించ‌లేదు. దీనికి సంబంధించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశాన్ని ఎన్నికైన ప్ర‌తినిధుల‌కు ఇవ్వాల‌న్న అభిప్రాయాన్ని ఆ ముసాయిదాలో వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం కొంద‌రు సుప్రీంకోర్టు ముందు నిర‌స‌న చేప‌ట్టారు. దీంతో ఆందోళనలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాగా జూలైలో అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించాల్సి ఉంది.

చదవండి: నిరసనకారులను కాల్చి చంపేయమని ఆదేశించిన ట్రంప్‌

మరిన్ని వార్తలు