ఆ అపురూపం వెనక కన్నీళ్లెన్నో!?

1 Oct, 2020 17:00 IST|Sakshi

పాశ్చాత్య పాప్‌ సంగీతంలో కుర్రకారును ఉర్రూతలూగించడంతో పాటు తన తరానికి విషాదాశ్రుతుషారాల నిషానందిస్తున్న ‘మారియా కేరి’ పేరును పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గాయనిగా, గేయ రచయితగా, మ్యూజిక్‌ కంపోజర్‌గా, ఆల్బమ్‌ మేకర్, నటిగా పలు పాత్రలు పోషిస్తున్న ఆమెను ‘గ్రామీ అవార్డు’ ఎప్పుడో వరించింది. న్యూయార్క్‌లోని బెడ్‌ఫోర్డ్‌లో 50 ఎకరాల స్థలంలో సువిశాల భవంతిలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వస్తోన్న ఆమె ప్రతి క్రిస్మస్‌ పండగకు కుటుంబ సభ్యులతోపాటు బంధు మిత్రులతో కలిసి కొలరాడోలోని పర్వత ప్రాంతాలకు వెళ్లడం అలవాటు.

మారియా కేరి ఆస్తి విలువ నాలుగువేల కోట్ల రూపాయలు ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆమె ఓ సాధారణ కుటుంబంలోనే జన్మించి ఈస్థాయికి వచ్చారంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో ఆమె తన చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారో, ఎన్ని కన్నీళ్లను కార్చారో. ఆమె తన జీవిత విశేషాలను వివరిస్తూ రాసిన ‘ది మీనింగ్‌ ఆఫ్‌ మారియా కేరి’ పుస్తకం మొన్న సెప్టెంబర్‌ 29వ తేదీన మార్కెట్‌లోకి వచ్చింది. (చదవండి : జపాన్‌లో సంచలనం సృష్టించిన ట్విట్టర్‌ హత్యలు)

తన ఆరేళ్ల వయస్సులోనే తన కళ్ల ముందు తన తల్లిని  అన్న గోడకేసి బాదిన భయంకర దృశ్యం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో పాటు తన సోదరి తనకు కొకైన్, వాలియమ్‌ మత్తు మందులను అలవాటు చేసి వేశ్య గృహానికి తనను అమ్మేసేందుకు ప్రయత్నించడం, చిన్నప్పటి నుంచే జాతి విద్వేషాన్ని అనుభవించిన వైనాలను ఆమె తన పుస్తకంలో వివరించారు. తండ్రి నీగ్రో, తల్లి శ్వేత జాతీయురాలికి పుట్టిన మారియా జీవితానుభాలు అన్నీ ఇన్నీ కావు. సోని మ్యూజిక్‌ ప్రెసిడెంట్‌ టామ్మీ మొటోలాను 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత ఐదేళ్లకే ఆయనతో విడిపోయారు. ఆ తర్వాత నికీ కానన్‌ను పెళ్ల చేసుకున్న ఆమె ఆయనతో కూడా ఐదేళ్లకే విడిపోయారు. తన మాజీ భర్తలంతా తనను ఓ ఏటీఎం యంత్రంగా చూడగా, బాయ్‌ ఫ్రెండయిన బేస్‌ బాల్‌ ప్లేయర్‌ డెరిక్‌ జెటర్‌ తనను మనిషిగా చూస్తారని ఆమె తన పుస్తకంలో వివరించారు. జెటర్‌ తల్లి ఐరిష్‌ యువతికాగా, తండ్రి నీగ్రో అవడమే తమ మధ్య సామీప్యతకు ఓ కారణం కావచ్చని ఆమె చెప్పారు.(చదవండి : కరోనా నియంత్రణలోనే ఉంది: ఉత్తర కొరియా)


సరిగ్గా 50 ఏళ్లు నిండిన మారియా కేరిది అపురూపమైన అందం. ఇద్దరు పిల్లలున్న మారియా కేరి ప్రస్తుతం బెడ్‌ఫోర్డ్‌లోని సువిశాల భవంతిలో ఎక్కువగా ఒంటరిగానే గడుపుతున్నారు. అణువణువున సాయుధ అంగరక్షకుల పహరా మధ్య ఆమె గదుల నిండా కుక్క పిల్లలను, పిల్లులను పెంచుకుంటూ చూయింగ్‌ గమ్‌ నములుతూ కాలక్షేపం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు