రష్యా దళాలకు చెక్‌.. ఆ దిశగా ముందుకు సాగుతున్న అమెరికా బలగాలు

4 Mar, 2022 07:40 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌ సంక్షోభం తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో అమెరికా పలువురు సైనికులను యూరప్‌లోని తన స్థావరాలకు తరలిస్తోంది. యూరప్‌లోని బేస్‌లకు 12వేల మంది సైనికులను పంపాలని పెంటగాన్‌ వర్గాలు ఆదేశించాయి. వీరంతా నాటో బలగాలకు శిక్షణ ఇవ్వడంతో పాటు రష్యా ముందుకు రాకుండా నిలవరిస్తారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో యూఎస్‌ ఇంతవరకు నేరుగా పాలు పంచుకోలేదు. ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయం మాత్రమే అందిస్తోంది. అయితే రష్యా క్రమంగా నాటో సభ్యదేశాలపై కన్నేసే ప్రమాదం ఉందని యూఎస్‌ భావిస్తోంది. ముందు జాగ్రత్తగా సైనికులను తరలిస్తోంది. 

ఇదిలా ఉండగా.. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య రెండో దఫా చర్చలు బెలారస్‌ సమీపంలో పోలండ్‌ సరిహద్దుల వద్ద గురువారం జరిగాయి. చర్చల సందర్భంగా ఇరు దేశాలూ తమ డిమాండ్లపై పట్టుబట్టినట్టు సమాచారం. అయితే పౌరులు యుద్ధ క్షేత్రాల నుంచి సురక్షితంగా తరలి వెళ్లేందుకు సహకరించాలని, అందుకు వీలుగా ఆయా చోట్ల తాత్కాలికంగా కాల్పులను విరమించాలని అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించినట్టు రష్యా తరఫున చర్చల్లో పాల్గొన్న పుతిన్‌ సలహాదారు వ్లాదిమిర్‌ మెడిన్‌స్కీ తెలిపారు. చర్చల్లో ఇరు దేశాలూ తమ తమ డిమాండ్లకు కట్టుబడ్డాయన్నారు. కొన్నింటిపై పట్టువిడుపులతో వ్యవహరించాలన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమైందని చెప్పారు.

పోరాడుతున్న ఉక్రెయిన్‌..
రష్యా దళాలను ఉక్రెయిన్‌ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. గెరిల్లా తరహా యుద్ధ వ్యూహాలతో ప్రతి చోటా అడుగడుగునా ఆటంకపరుస్తున్నాయి. సైన్యం చొచ్చుకురాకుండా అడ్డుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ వాడుకుంటున్నాయి. నగరాలకు దారితీసే నేమ్‌ బోర్డులను మార్చడం, తారుమారు చేయడం, బ్రిడ్జీలను పేల్చేయడం తదితర చర్యలకు దిగుతున్నాయి. మరోవైపు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 9 వేలకు పైగా రష్యా సైనికులను మట్టుబెట్టిన్టట్టు ఉక్రెయిన్‌ సైనిక జనరల్‌ కార్యాలయం ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొంది. 
 

మరిన్ని వార్తలు