టెన్షన్‌ పెడుతున్న చైనా.. ఉక్రెయిన్‌ తరహాలో దురాక్రమణకు ఛాన్స్‌.. తైవాన్‌ కీలక నిర్ణయం

27 Dec, 2022 14:57 IST|Sakshi

తైపీ: చైనా నుంచి యుద్ధం, ఆక్రమణల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. తైవాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏడాది మిలిటరీ సర్వీస్‌ను తప్పనిసరి చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చైనా నుంచి ఏనాటికైనా ఆక్రమణ తప్పదనే భయాందోళనలో ఉండింది ఈ చిన్న ద్వీప దేశం.  ఈ నేపథ్యంలో అధ్యక్షురాలు  సాయ్ ఇంగ్-వెన్ స్వయంగా ఈ ప్రకటన చేయడం విశేషం. 

తైవాన్‌పై చైనా బెదిరింపులు తీవ్రంగా కనిపిస్తున్నాయి.  యుద్ధం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ, నా తోటి పౌరులారా.. శాంతి ఆకాశం నుంచి ఊడిపడదని గుర్తించాలి అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులో  త్వరగతిన మారుతున్న పరిస్థితుల ఆధారంగా.. నాలుగు నెలల మిలిటరీ సర్వీస్‌ సరిపోదు. అందుకే దానిని ఏడాదికి పొడిగించాలని నిర్ణయించాం. 2024 నుంచి ఏడాది మిలిటరీ సర్వీస్‌ తప్పనిసరి కానుంది. 2005 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వాళ్లందరికీ.. కొత్త కొనసాగింపు వర్తిస్తుందని సాయ్‌ ఇంగ్‌ వెన్‌ ప్రకటించారు.

రెండు రోజుల కిందట.. తైవాన్‌ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించింది.  వాష్టింగ్టన్‌, తైపీలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని.. సైనిక విన్యాసాలను చైనా సమర్థించుకుంది కూడా.   

తైవాన్‌లో ఒకప్పుడ ఏడాది మిలిటరీ సర్వీస్‌ నిబంధన ఉండేది. కానీ, తర్వాతి కాలంలో దానిని నాలుగు నెలల కాలపరిమితికి కుదించారు. అయితే, సరిహద్దులో సైనిక చర్యల ద్వారా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యం.. డ్రాగన్‌ కంట్రీ నుంచి ఏనాటికైనా యుద్ధం తప్పదనే భావనలోకి చేరుకుంది తైవాన్‌. 

తమను తాము స్వపరిపాలన.. ప్రజాస్వామ్యిక దేశంగా తైవాన్‌ ప్రకటించుకుంది. కానీ,  తైవాన్‌ తమ భూభాగానికే చెందుతుందని డ్రాగన్‌ కంట్రీ ప్రకటించుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్‌కు అండగా అమెరికా ప్రకటనలు ఇవ్వడం, అక్కడి ప్రతినిధులు తైవాన్‌ గడ్డపై పర్యటించడం చైనాకు కోపం తెప్పిస్తోంది.  ఈ పరిస్థితులకు తోడు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఈ మధ్య కాలంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.  తైవాన్‌ సరిహద్దులో వరుసపెట్టి మిలిటరీ ఆపరేషన్స్‌ నిర్వహిస్తుండడంతో.. తరచుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా తరహాలో చైనా కూడా తమ భూభాగంపై దురాక్రమణకు పాల్పడవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది తైవాన్‌.

మరిన్ని వార్తలు