భార్యాభర్తలకూ భౌతికదూరం తప్పదు!

17 Oct, 2020 14:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా విధించిన ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా లండన్, టూ టైర్, త్రీ టైర్‌ నగరాల్లో, కరోనా తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేర్వేరుగా ఉంటున్న భార్యాభర్తలు, సుదీర్ఘకాలంపాటు సన్నిహిత సంబంధాలు కలిగిన జంటలు ఇంట్లో అయినా, బయటైనా కలుసుకున్నప్పుడు ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ మార్గదర్శకాల్లో పేర్కొంది.

అంటే వారు లైంగిక సంబంధాలు కొనసాగించరాదని పరోక్షంగా స్పష్టం చేసింది. ఒకే కప్పు కింద నివసిస్తున్న భార్యాభర్తలు, సహజీవనం సాగిస్తున్న జంటలు ఇంటా బయట భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, వారు లైంగిక సంబంధాలు కొనసాగించవచ్చని పేర్కొంది. కుటుంబ సభ్యులు మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, బయటకు వెళ్లినప్పుడు పాటించాలంటూ ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.


ఉద్యోగం రిత్యా, లేదా మరే ఇతర కారణాల వల్లనో వేర్వేరుగా జీవిస్తున్న భార్యాభర్తలు, సహజీవన జంటలు ఇంటా బయట కలసుకున్నప్పుడు  భౌతిక దూరం పాటించాల్సిందేనంటూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను లైంగికంగా కలుసుకోరాదని చెప్పే హక్కు ప్రభుత్వానికి లేదని, ఇది తమ ప్రైమసీ హక్కులకు భంగం కలిగించడమేనంటూ వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. కొత్తగా విధించిన ఆంక్షలు ఎంతవరకు సబబంటూ ప్రభుత్వ వర్గాలను ప్రశ్నించగా, సమాజంలో ఇప్పటికీ కరోనా వైరస్‌ వేగంగా విజంభిస్తోందని, కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే ఇతర కుటుంబ సభ్యులకు సోకకుండా నివారించేందుకే ఈ నిబంధనలంటూ ప్రభుత్వ వర్గాలు సమర్థించాయి. 

మరిన్ని వార్తలు