కొలంబియా వర్సిటీలో ఏపీ విద్యార్థుల ప్రసంగం

18 Sep, 2023 06:02 IST|Sakshi

ఏపీలో విద్యా ప్రగతికి తామే ఉదాహరణ అని వెల్లడి

సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో విద్యా రంగంలో సమూల మార్పులు

సాక్షి, అమరావతి: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితికి ఏపీ నుంచి వెళ్లిన 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఆదివారం కొలంబియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో పాలుపంచుకున్నారు. ఇక్కడి సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌లోని విద్యా విభాగం డైరెక్టర్‌ రాధికా అయ్యంగార్‌ ఆధ్వర్యంలో ‘ఎడ్యుకేట్‌ ఎ చైల్డ్‌’ లెక్చర్‌ నిర్వహించారు.ఇందులో పాల్గొన్న ఏపీ విద్యార్థులు.. మాల శివలింగమ్మ, మోతుకూరి చంద్రలేఖ, గుండుమోగుల గణేష్, దడాల జ్యోత్స్న, సి.రాజేశ్వరి, పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, వంజివాకు యోగేశ్వర్, షేక్‌ అమ్మాజాన్, సామల మనస్విని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంక్షేమ పథకాలను వివరించారు.

ముఖ్యంగా సీఎం జగన్‌ నాయకత్వంలో విద్యా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు­లకు అందిస్తున్న ద్విభాషా పాఠ్యపుస్తకాలు..,టాబ్లెట్‌లు, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశ సంస్కరణలను ప్రవేశపెట్టడం వల్ల విద్యారంగం ఎలా మారిందో.. తాము ఎలా ప్రగతి సాధించామో వివరించారు. మనబడి నాడు–నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాల ద్వారా పేద విద్యార్థులకు ఎంత మేలు జరుగుతోందో వివరించారు. 

42 లక్షల మంది విద్యార్థులకు సీఎం జగన్‌ భరోసా 
తమలాంటి 42.62 లక్షల మంది విద్యార్థులకు సీఎం జగన్‌ నాయకత్వంలోని ప్రభుత్వమే అన్ని విధాలుగా అండగా ఉందని విద్యార్థులు వివరించారు. సమీప భవిష్యత్‌లో తాము కూడా జగనన్న విదేశీ విద్యాదీవెన ప్రథకం ద్వారా ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవాలన్న ఆకాంక్షను వెల్లడించారు. ఈ సందర్భంగా యూఎన్‌ఓ గ్లోబల్‌ స్కూల్స్‌ ప్రోగ్రామ్‌ ఎక్సట్రనల్‌ అఫైర్స్‌ అధికారి అమెండా అబ్రూమ్, సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ జెఫ్రీ డి సాచ్‌తో ప్రత్యేకంగా సమావేశమై మన విద్యా విధానాలు, బోధనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐఎఫ్‌పీ స్క్రీన్లు, ట్యాబ్స్, నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రతిభ గలవారికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు.

మధ్యాహ్నం జరిగిన ఎకో అంబాసిడర్స్‌ వర్క్‌షాప్‌లో సైతం పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా యూఎన్‌ఓ స్పెషల్‌ స్టేటస్‌ మెంబర్‌ ఉన్నవ షకిన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు ఈనెల 20న జర్నలిస్ట్‌ అండ్‌ రైటర్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని జాన్‌ జే కాలేజ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ జస్టిస్‌లో జరిగే ఎస్‌డీఎస్‌ సర్వీస్‌ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థుల వెంట సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు