నాది సాదాసీదా జీవితం: అనిల్‌ అంబానీ

27 Sep, 2020 03:24 IST|Sakshi

లండన్‌: ప్రపంచ దేశాలను చైనా వణికిస్తుంటే..రిలయన్స్‌ అనిల్‌ అంబానీ చైనాకే ఝలక్‌ ఇచ్చారు. చైనాకు చెందిన మూడు బ్యాంకు రుణాల చెల్లింపునకు తనది పూచీ కాదన్నారు. తనది చాలా విలాసవంత జీవితమంటూ వస్తున్నవన్నీ వదంతులేనన్నారు. ‘నాది చాలా క్రమశిక్షణాయుత జీవితం. అవసరాలు చాలా పరిమితం. ఒకే ఒక్క కారు వాడుతున్నాను. కోర్టు ఫీజులు చెల్లించేందుకు బంగారాన్ని అమ్ముకున్నాను’ అని వివరించారు. చైనా బ్యాంకులతో తలెత్తిన రుణ ఒప్పందం వివాదంపై లండన్‌ కోర్టుకు ఆయన ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. తనకు ఖరీదైన చాలా కార్లున్నాయనీ, విలాసవంతమైన జీవితమంటూ లాయర్‌ అడిగిన ప్రశ్నకు అనిల్‌.. అవన్నీ మీడియా సృష్టించిన కల్పిత వార్తలని కొట్టిపారేశారు.

ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా లిమిటెడ్, చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్, ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాల నుంచి 2012లో 925 మిలియన్‌ డాలర్ల మేర ఆర్‌కామ్‌ రుణం తీసుకుంది. పూచీకత్తుగా ఉన్న అనిల్‌ అంబానీయే ఆ మొత్తం చెల్లించాలంటూ  బ్యాంకులు కోరుతున్నాయి. ఈ మేరకు బ్రిటన్‌ కోర్టులో దావా వేశాయి. ఆ రుణంలో కొంత మొత్తం చెల్లించాలంటూ కోర్టు ఈ ఏడాది మేలో ఆదేశించింది. అనిల్‌ చెల్లించకపోవడంతో ఆయన్ను వీడియో లింక్‌ ద్వారా క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసి, ఆస్తుల వివరాలు రాబట్టేందుకు బ్యాంకు తరఫు లాయర్లకు కోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు శనివారం జరిగిన విచారణలో అనిల్‌ పై విషయాలను వెల్లడించారు.   

మరిన్ని వార్తలు