జంతువులపై కోవాగ్జిన్‌ సత్ఫలితాలు

13 Sep, 2020 04:24 IST|Sakshi

న్యూఢిల్లీ/లండన్‌: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ టీకా జంతువులపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు చూపిందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. కోతులపై జరిపిన ప్రయోగాల్లో వాటి శరీరాల్లో బలమైన వ్యాధినిరోధకత కనిపించినట్లు తెలిపింది. దీనివల్ల ప్రైమేట్‌ జీవుల్లో వ్యాధి నిరోధకత పెంచే విషయంలో అంచనాలు మరింత మెరుగయ్యాయని తెలిపింది.

ప్రయోగాల కోసం 20 రీసస్‌ కోతులను నాలుగు గ్రూపులుగా విభజించామని, వీటిలో ఒక గ్రూప్‌ కోతులకు ప్లాసిబో(ఎటువంటి ఔషధం లేని డోసు)ను ఇచ్చామని, మిగిలిన గ్రూపుల్లో కోతులకు మూడు రకాల వ్యాక్సిన్స్‌ను ఇచ్చామని వివరించింది. 14 రోజుల అనంతరం అన్ని కోతులను వైరస్‌కు గురిచేశామని, అనంతరం వ్యాక్సిన్‌ తీసుకున్న కోతుల్లో ఐజీ–జి యాంటీబాడీలు పెరిగి, గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లో వైరస్‌ పెరుగుదలను తగ్గించినట్లు తెలిసిందని తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకున్న కోతుల్లో న్యుమోనియా లక్షణాలు కనిపించలేదంది. టీకా ఇచ్చిన కోతుల్లో భారీ సైడ్‌ఎఫెక్ట్‌లు కానరాలేదని తెలిపింది.  

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు మళ్లీ షురూ  
ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలను ఆపేసిన అతిపెద్ద ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ బ్రిటన్‌లో మళ్లీ ట్రయల్స్‌ను మొదలుపెట్టాయి. ఈ ట్రయల్స్‌ సురక్షితమని మెడిసిన్స్‌ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) నిర్థారించడంతో ప్రయోగాలను పునఃప్రారంభించినట్లు ఆస్ట్రాజెనెకా,  ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ చెప్పాయి. భారత్‌లో ఆస్ట్రాజెనెకా క్లీనికల్‌ ట్రయల్స్‌ను డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి పొందాక పునఃప్రారంభిస్తామని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ శనివారం తెలిపింది. ట్రయల్స్‌ పూర్తిగా ముగిసేవరకు ఒక నిర్ధారణకు రాకూడదని కంపెనీ సీఈఓ పూనావాలా చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు