శరణార్థులుగా మరో 5 లక్షల మంది అఫ్గాన్లు

28 Aug, 2021 06:28 IST|Sakshi

యూఎన్‌ హెచ్‌సీఆర్‌ అంచనా

జెనీవా: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్న అనంతర పరిణామాలతో మరో 5 లక్షల మంది ప్రజలు స్వదేశాన్ని వీడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన శరణార్థుల విభాగం యూఎన్‌హెచ్‌సీఆర్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికీ ఆ దేశంలో అనిశ్చితి కొనసాగుతోందని, రానున్న రోజుల్లో పరిస్థితులు మరింతగా దిగజారి 5.15 లక్షల మంది వరకు ప్రజలు శరణార్థులుగా మారే ప్రమాదముందని పేర్కొంది. వీరికి ఆహారంతోపాటు తగు వసతులు కల్పించేందుకు సుమారు 30 కోట్ల డాలర్లు అవసరమని అంచనా వేసింది. ఇప్పటికే ఇరాన్, పాకిస్తాన్‌ తదితర దేశాల్లో 22 లక్షల మంది అఫ్గాన్లు శరణార్థులుగా నమోదై ఉన్నారని తెలిపింది.

‘ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలి, దేశంలో హింస పెచ్చరిల్లిపోవడంతో ఆ ప్రభావం సామాన్య పౌరులపై తీవ్రంగా పడుతోంది. వారంతా ఉన్న చోటును వదిలి వేరే సురక్షిత ప్రాంతాలను వెదుక్కుంటూ మరోచోటుకు తరలివెళ్తున్నారు. అంతర్యుద్ధం కారణంగా కేవలం ఈ ఏడాదిలోనే 5.58 లక్షల మంది ఇలా తరలివెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలు, చిన్నారులే. పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చి.. అంతర్గతంగా, విదేశాలకు తరలివెళ్లే వారి సంఖ్య ముందుముందు మరింత పెరిగే ప్రమాదముంది. అఫ్గాన్‌ ప్రజలకు రానున్నవి చీకటి రోజులు’ అని యూఎన్‌ హెచ్‌సీఆర్‌ ఆసియా పసిఫిక్‌ రెఫ్యూజీ నెట్‌వర్క్‌ సీఈవో నజీబా వజెదాఫోస్ట్‌ శుక్రవారం వర్చువల్‌ మీడియా కాన్ఫరెన్స్‌లో తెలిపారు.  

మరిన్ని వార్తలు