యూరప్‌లో లాక్‌డౌన్‌ వ్యతిరేక ఆందోళన

29 Oct, 2020 19:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ విజంభణను అరికట్టేందకు యూరప్‌లో అమలు చేస్తోన్న రెండో విడత లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. ఇటలీలో వరుసగా మూడోరోజు రాత్రి నిరసనకారులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. సాకర్‌ అభిమాన అల్లరి మూకలు, మితవాద తీవ్రవాదుదు ఈ ఆందోళనలు కొనసాగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇటలీ ప్రధాన మంత్రి గిసెప్పే కాంటే బుధవారం నాటి నుంచి రోమ్, నాప్‌లెస్, మిలాన్‌ నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఇందులో భాగంగా క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, స్మిమ్మింగ్‌ ఫూల్స్‌ను మూసివేశారు. కరోనా కట్టడి చేయడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ప్రకటించారు.

దీంతో రెస్టారెంట్ల యజమానలు, టాక్సీ డ్రైవర్లు పగటి వేళల్లో శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తుండగా, సాకర్‌ అభిమాన అల్లరి మూకలు రాత్రిపూట విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఇదో అదనుగా కొన్ని అల్లరి మూకలు దుకాణాల లూటీకి పాల్పడుతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇటలీలో దాదాపు ఆరు లక్షల కరోనా కేసులు నమోదుకాగా, 38 వేల మంది మరణించారు. మరోపక్క స్పెయిన్‌లో రెండో విడత లాక్‌డౌన్‌ కింద దేశవ్యాప్తంగా 15 రోజులపాటు తాత్కాలిక ప్రాతిపదికన అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తూ స్పానిష్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎమర్జెన్సీని ఆరు నెలలపాటు పొడగించాల్సిందిగా ఆయన దేశ పార్లమెంట్‌ను కోరనున్నారు. స్పెయిన్‌లో దాదాపు పది లక్షల మంది కరోనా వైరస్‌ బారిన పడగా, వారిలో దాదాపు 35 వేల మంది మరణించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు