యాంటీబాడీలు అందరిలో ఒకేలా ఉండవు

25 Mar, 2021 02:36 IST|Sakshi

కొందరిలో దశాబ్దం కూడా ఉండొచ్చు

లాన్సెట్‌ జర్నల్‌ నివేదిక

సింగపూర్‌: కరోనా వైరస్‌పై పోరాడే యాంటీ బాడీలు కొందరిలో దశాబ్దం పాటు ఉండవచ్చునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థ పని చేసే తీరుని బట్టి యాంటీ బాడీలు ఎన్నాళ్లు శరీరంలో ఉంటాయో ఆధారపడి ఉంటుందని లాన్సెట్‌ మైక్రోబ్‌ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి శరీరంలో న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌ (ఎన్‌ఏబీ) తక్కువ స్థాయిలో ఉత్పత్తి అయినప్పటికీ టీ సెల్స్‌ , రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పని చేస్తున్నప్పడు వారికి మళ్లీ వైరస్‌ సోకే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయినట్టుగా నివేదిక స్పష్టం చేసింది.

సింగపూర్‌లోని డ్యూక్‌–ఎన్‌యూఎస్‌ మెడికల్‌ స్కూలుకి చెందిన శాస్త్రవేత్తలు ఆరు నుంచి తొమ్మిది నెలలు పాటు 164 మంది కోవిడ్‌ రోగులకు రక్త పరీక్షలు నిర్వహిస్తూ వారిలో కరోనా వైరస్‌పై పోరాటంలో ఎన్‌ఏబీ, టీ సెల్స్, రోగ నిరోధక వ్యవస్థ పని తీరు వంటివన్నీ అంచనా వేస్తూ వచ్చారు. అధ్యయనంలో పాల్గొన్న వారిని అయిదు కేటగిరీలుగా విభజించారు. యాంటీ బాడీలు అసలు ఉత్పత్తి కాని వారు 11.6శాత మంది ఉంటే, యాంటీ బాడీలు ఉత్పత్తి అయినప్పటికీ అవి త్వరగా క్షీణించిన వారి శాతం 26.8గా ఉంది. 29 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు నెమ్మదిగా క్షీణించడం కనిపించింది. ఇక 1.8శాతం మందిలో యాంటీబాడీలు స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వైరస్‌ సోకినప్పటికీ, వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయన్నది వారి రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని  డ్యూక్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ లిన్ఫా వెల్లడించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు