అధ్యక్ష ఎన్నికలు- భారత వాణిజ్యానికి లింకు!

12 Sep, 2020 19:23 IST|Sakshi
డొనాల్డ్‌ ట్రంప్‌-జో బైడెన్‌ (ఫైల్‌ ఫోటో)

అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అమెరికాతో వాణిజ్య, దౌత్యపరంగా సత్సంబంధాలు కొనసాగిస్తున్న దేశాల్లో ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు భారత బిజినెస్‌కు లింకుందా? ఎన్నారై ఓట్లను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రెసిడెంట్‌ పదవి కోసం ఎన్నికల బరిలోకి దిగిన జో బైడెన్‌ భారత్‌తో వాణిజ్య ఒప్పందాలను తెరమీదకు తీసుకువస్తారా? అసలు ఇప్పటివరకు ట్రంప్‌ భారత్‌కు ఇచ్చిన హామీలేంటీ? అందులో అమల్లోకి వచ్చినవెన్ని? ఎన్నికలకు ముందు అమల్లోకి వచ్చే ఒప్పందాలెన్ని? అమెరికాలో ఓటున్న భారతీయులు ఏ ప్రాతిపదికన ఓటు వేయబోతున్నారు? ట్రంప్‌, జోబైడెన్‌ ఎవరివైపు మొగ్గు చూపనున్నారు?

అమెరికా ఎన్నికలకు- భారత బిజినెస్‌కు లింకు!
అమెరికా, భారత్‌ మధ్య ఏటా కొన్ని వేల బిలియన్‌ డాలర్ల మేర వాణిజ్యం జరుగుతోంది. అంతేగాక ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో భాగంగా భారత్‌కు విచ్చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌.. మరిన్ని ఒప్పందాలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటన చేశారు. భారీగా హామీలు కూడా ఇచ్చారు. అయితే ఆ దిశగా ఒక్క ముందడుగు పడలేదు. ఇలాంటి తరుణంలో నవంబరు 3న జరుగనున్న అమెరికా ఎన్నికలపై భారత్‌ ఓ కన్నేసింది. పలు వాణిజ్య ఒప్పందాలు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో..  ‘‘మీ ఎన్నికలు మీవే కానీ.. మా ఒప్పందాల సంగతి ఇప్పుడు మాత్రమే పరిష్కారం అవుతాయన్నది’’ ఇండియన్‌ స్ట్రాటజీగా కనిపిస్తోంది.

జీఎస్పీని పునరుద్ధరిస్తామన్న ట్రంప్‌.. కానీ
వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్య దేశాలకు జీఎస్పీ(జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌) రేటింగ్‌ ఇచ్చే అమెరికా.. మార్చి 2019లో భారత్‌కు ఆ హోదాను రద్దు చేసింది. అమెరికాకు ఇచ్చినంత ప్రాధాన్యతను భారత్‌ ఇతర దేశాలకు కూడా ఇస్తోందన్నది అప్పట్లో ట్రంప్‌ అనుమానం. ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయంతో భారత వాణిజ్యానికి భారీ నష్టం వాటిల్లింది. దీంతో జీఎస్పీని పునరుద్ధరించాలంటూ భారత్‌ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆయన సమాధానం దాటవేస్తూ వచ్చారు. అయితే ఇండియాతో బంధాన్ని పటిష్టం చేసుకునే క్రమంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం కోసం భారత్‌కు వచ్చినపుడు ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ట్రంప్‌.. జీఎస్పీ హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అదే గనుక కార్యరూపం దాలిస్తే.. భారత్‌కు వెయ్యి కోట్ల డాలర్ల వరకు లాభం చేకూరుతుంది. అయితే ట్రంప్‌ ఆనాడు ఇచ్చిన హామీ ఆచరణలోకి మాత్రం రాలేదు. ఈ విషయంలో అమెరికా ఆలోచనలు మరోలా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 

ప్రపంచాన్ని శాసించే ఆర్థిక వ్యవస్థపై అమెరికా కన్ను
అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి ఆసియా ప్రధాన దేశాలైన చైనా, భారత్‌. అయితే ఇండియా కంటే చైనా ఆర్థిక వ్యవస్థ అయిదు రెట్లు ఎక్కువ. భారత ఆర్థిక వ్యవస్థ విలువ 2.7 లక్షల కోట్ల డాలర్లు అయితే.. చైనా ఆర్థిక వ్యవస్థ విలువ ఏకంగా 13 లక్షల కోట్ల డాలర్లు. ఇంతటి వ్యత్యాసం ఉంది గనుక పన్నులు, సుంకాల విషయంలో డ్రాగన్‌ దేశంపై చైనాపై అనుసరిస్తున్న తీరును మనకు వర్తింపజేయడం సరికాదన్నది భారత్‌ వాదన. ఈ నేపథ్యంలో అమెరికాతో మొదటి నుంచి స్నేహపూర్వకంగా మెదులుతున్న భారత్‌కు ఎంతో కొంత అనుకూలంగా ఉండాలని ట్రంప్‌ పట్టుబడుతున్నారు. అయితే భారీ ఒప్పందాల జోలికి పోకుండానే జీఎస్పీని పునరుద్ధరించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. 

వీసాల విషయంలో ట్రంప్‌ కఠిన వైఖరి
ఇక భారత్‌ ముందున్న మరో ప్రధాన అంశం ఇమ్మిగ్రేషన్‌. వీసాల విషయంలో ట్రంప్‌ ఎప్పటిలాగానే కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఆయన నిర్ణయాలతో భారత్‌కు భారీ నష్టం వాటిల్లుతోంది. హెచ్‌1 బీ వీసాలు, స్టూడెంట్‌ వీసాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బరాక్‌ ఒబామా హయాంలో ఎంతో మంది భారతీయులకు ప్రయోజనం చేకూరింది. అయితే వలస విధానంపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌ తీరుతో గ్రీన్‌కార్డు దరఖాస్తుల సంగతి  అటకెక్కింది. దీంతో డాలర్‌ డ్రీమ్స్‌, అమెరికాలో ఉద్యోగం ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

ట్రంప్‌ విధానాలతో సాఫ్ట్‌వేర్‌ బూమ్‌తో అమెరికాకు వలసలు పెంచుకున్న భారతీయులు.. గత నాలుగేళ్లుగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. పెరిగిన ఆంక్షలతో వెనక్కి వచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అంతేకాదు మంచి కాలేజీల్లో ఆడ్మిషన్లు వచ్చినా.. అమెరికాకు వెళ్లేందుకు విద్యార్థులు జంకుతున్నారు. హెచ్‌1బీ వీసాల విషయంలో ట్రంప్‌ సర్కారు డేగకన్ను వేయడం ఎన్నారైలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రవాస భారతీయులు భారత్‌కు జమ చేసే విదేశీ మారక ద్రవ్యం భారీగా తగ్గిపోతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని సాఫ్ట్‌వేర్‌ నిపుణులు జో బైడెన్‌ వైపు మళ్లే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. డెమొక్రాట్‌ ప్రభుత్వం వస్తే వలసల విషయం కొన్ని మినహాయింపులు లభించవచ్చన్నది కొందరు ఎన్నారైల ఆశ.

-శ్రీనాథ్‌ గొల్లపల్లి, సీనియర్‌ ఔట్‌ పుట్‌ ఎడిటర్‌, సాక్షి టీవీ

మరిన్ని వార్తలు