షిప్‌లో ఇల్లు కావాలా? 24 ఏళ్ల వరకు అద్దెకు అపార్ట్‌మెంట్‌లు .. ప్రారంభ ధరెంతో తెలుసా?

27 Jan, 2022 11:17 IST|Sakshi

నేల మీద ఉండీ ఉండీ బోర్‌ కొట్టిందా. కాస్త వెరైటీగా సముద్రంలో ఇల్లు కట్టుకొని ఉంటే భలే ఉంటుందని అనుకుంటున్నారా. అయితే మీ కోసం ఓ గుడ్‌ న్యూస్‌! సముద్రంలో ఉండటమే కాదు. బోర్‌ కొడితే నీళ్లలో అలా ఓ చుట్టు చుట్టేసి కూడా వచ్చేలా ఇళ్లు సిద్ధమవుతున్నాయి. అదెలా.. అనుకుంటున్నారా. ఓ లగ్జరీ క్రూయిజ్‌ షిప్‌లో ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు.     
– సాక్షి, సెంట్రల్‌డెస్క్‌

రూ. 2.7 కోట్ల నుంచి మొదలు 
ఫ్లోరిడాకు చెందిన స్టోరీ లైన్స్‌ కంపెనీ ‘ఎంవీ నరేటివ్‌’పేరుతో లగ్జరీ క్రూయిజ్‌ షిప్‌ను నిర్మిస్తోంది. 2024 కల్లా ఇది అందుబాటులోకి రానుంది. షిప్‌లో ఒకటి నుంచి నాలుగు బెడ్రూమ్‌ల అపార్ట్‌మెంట్‌లు, స్టూడియోలు కలిపి మొత్తం 547 నిర్మిస్తోంది. వీటినే తాజాగా అమ్మకానికి పెట్టింది. వీటి ధర రూ.2.7 కోట్ల నుంచి మొదలవుతుంది. ఇంటి పరిమాణం, ఇంట్లోని వస్తువులను బట్టి ధర పెరుగుతుంటుంది. ఇళ్లను 12, 24 ఏళ్లకు అద్దెకు కూడా ఇస్తారు. వీలైనంత తక్కువ ధరకు ప్రజలకు ఇళ్లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ చెబుతోంది.  
(చదవండి: కేసులు పెరుగుతున్నా.. మరణాలు తక్కువే!)

ఇంటికి కావాల్సినవన్నీ అందుబాటులో.. 
ప్రతి అపార్ట్‌మెంట్‌లో ఇంట్లో ఉండటానికి కావాల్సిన ఫర్నిచరంతా ఉంటుంది. ఇటాలియన్‌ ఇంటీరియర్‌ డిజైన్లతో అద్భుతంగా కనిపిస్తుంది. కిచెన్, టీవీలు, ఇంట్లో వేడి, చలి నియంత్రణ వ్యవస్థలు, మూడ్‌కు తగ్గట్టు కాంతి రంగులను మార్చుకునే వెసులుబాటు ఉంది. షిప్‌లో మొత్తం 20 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఎప్పుడైనా ఆర్డర్‌ చేసుకునేలా 24 గంటల హోమ్‌ డెలివరీ వెసులుబాటు ఉంది.

వినోదం కోసం ఓ సినిమా హాలు, బీర్లు అమ్మే చిన్న మైక్రో బ్రూవరీ, 3 స్విమ్మింగ్‌ పూల్స్, 10 వేల పుస్తకాలున్న లైబ్రరీ, స్పా, వెల్‌నెస్‌ సెంటర్, యోగా స్టూడియో కూడా ఉన్నాయి. అలాగే గోల్ఫ్‌ సిములేటర్, డ్యాన్స్‌ ఫ్లోర్‌ కూడా ఉన్నాయి. షిప్‌లో ఉండే వాళ్లు చెస్, ఫొటోగ్రఫీలాంటి క్లబ్‌లుగా ఏర్పడి ఆడుకోవచ్చు. ఈ షిప్‌ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అక్కడి పోర్టుల్లో దాదాపు 5 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి అక్కడి ప్రదేశాలను తిరిగి రావొచ్చు. షిప్‌ ఎక్కడికెళ్లాలి, ఎక్కడ ఆగాలో షిప్‌లోని వాళ్లు ముందే నిర్ణయించుకోవచ్చు కూడా.
(చదవండి: వారిని విడుదల చేయండి!)

>
మరిన్ని వార్తలు