ఎన్‌ఎస్‌ఓపై యాపిల్‌ కేసు

25 Nov, 2021 04:55 IST|Sakshi

ఐఫోన్‌లపై పెగాసస్‌ నిఘాను అడ్డుకోవడమే లక్ష్యం

రిచ్‌మండ్‌: దిగ్గజ కంపెనీ యాపిల్‌ వివాదాస్పద స్పైవేర్‌ పెగాసస్‌ను రూపొందించిన ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూపును కోర్టుకు లాగింది. ఐఫోన్‌ లాంటి తమ ఉత్పత్తుల్లోకి పెగాసస్‌ను జొ ప్పించకుండా నిరోధించాలని కాలిఫోర్నియాలోని ఫెడరల్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. ‘అత్యంత అధునాతన సైబర్‌ నిఘా సాంకేతికత సహాయంతో ఎన్‌ఎస్‌ఓ ఉద్యోగులు అనైతిక చర్యలకు పాల్పడే కిరాయి సైనికులుగా మారారని ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా కొద్దిసంఖ్యలో ఐఫోన్లపై పెగాసస్‌ ద్వారా నిఘా పెట్టారని పేర్కొంది.

ప్రభుత్వాల అండతో పనిచేసే ఎన్‌ఎస్‌ఓ లాంటి గ్రూపులు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా... మిలియన్ల కొద్ది డాలర్లను అత్యాధునిక నిఘా వ్యవస్థ అభివృద్ధికి వెచ్చిస్తాయి. ఇది మారాలి’ అని యాపిల్‌ సంస్థ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ క్రెయిగ్‌ ఫెడెరిఘి కోర్టుకు విన్నవించారు. తాము ఎలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం లేదని, కేవలం ప్రభుత్వాలకు మా త్రమే తమ ఉత్పత్తులను అమ్ముతున్నామని ఎన్‌ఎస్‌ఓ వాదిస్తోంది. విపక్షనాయకులు, మానవహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు తదితరులపై పెగాసస్‌ ద్వారా భారత ప్రభుత్వం నిఘా పెట్టిందనే ఆరోపణలు రావడంతో తీవ్ర దుమారం రేగడంతో దీనిపై సుప్రీంకోర్టు ముగ్గురు సాంకేతిక నిపుణులతో దర్యాప్తు కమిటీని వేయడం తెలిసిందే. 

మరిన్ని వార్తలు