వారెవ్వా.. సరికొత్త గిన్నిస్‌ రికార్డ్‌.. ‘కీహోల్‌’లోంచి ఏడు బాణాలు!

6 Nov, 2022 11:35 IST|Sakshi

విలువిద్య పోటీల్లో గుండ్రటి బోర్డుపై ఉండే ‘బుల్స్‌ ఐ’ని ఆటగాళ్లెవరైనా గురిచూసి కొడితేనే ఆహా అద్భుతం అని మెచ్చుకుంటాం.. అలాంటిది ఓ చిన్న బెజ్జంలోంచి బాణాలను సంధించగల నేర్పరిని ఇంకేమని పొగడాలి?! ఎందుకంటే.. డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విలుకాడు లార్స్‌ ఆండర్‌సెన్‌ నమ్మశక్యంకాని రీతిలో దీన్ని చేసి చూపించాడు మరి!! సంప్రదాయ ‘ఒట్టోమ్యాన్‌’ విల్లును ఉపయోగించి 30 అడగుల దూరంలో అది కూడా కేవలం ఒక సెంటీమీటర్‌ సైజున్న ‘కీహోల్‌’లోంచి అలవోకగా ఏడు బాణాలను వెంటవెంటనే సంధించాడు.

కీహోల్‌లోకి బాణాలు దూరగలిగేందుకు వీలుగా ఈకల్లేని కార్బన్‌ బాణాలను ఉపయోగించాడు. ఇటీవల అతను చేసిన ఈ ప్రయోగం ద్వారా ‘కీహోల్‌లోంచి వరుసగా అత్యధిక బాణాలను సంధించిన వ్యక్తి’గా సరికొత్త గిన్నిస్‌ రికార్డును సృష్టించాడు. ఇందుకు సంబంధించిన సుమారు నిమిషం నిడివిగల వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఆండర్‌సెన్‌ ప్రతిభను చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఆండర్‌సెన్‌ ఇప్పటికే ఈ తరహా ఎన్నో అద్భుతాలను చేసి చూపించాడు.
చదవండి: మద్యం మత్తులో బీజేపీ ఎమ్మెల్యే కొడుకు హంగామా.. నడిరోడ్డుపై..

విల్లు నుంచి ఏకకాలంలో ఎన్నో బాణాలను గురిచూసి సంధించడం, కేవలం 4.9 సెకన్ల వ్యవధిలో 10 బాణాలను వదలడం, బాణాలు గాల్లో వంపు తిరిగేలా సంధించడం, కదిలే లక్ష్యాలను బాణాలతో ఛేదించడం వంటి ఎన్నో ప్రయోగాలను విజయవంతంగా చేశాడు. విలువిద్యకు పూర్వ వైభవం తెచ్చే ఉద్దేశంతోనే తాను ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నట్లు అతను చెప్పాడు. 

మరిన్ని వార్తలు