బైడెన్‌ గెలుపును సర్టిఫై చేసిన ఆరిజోనా 

2 Dec, 2020 08:58 IST|Sakshi

వాషింగ్టన్‌: యూఎస్‌లో రెండు కీలక రాష్ట్రాలు ఆరిజోనా, విస్కాన్సిన్‌ సోమవారం డెమొక్రాటిక్‌ అభ్యర్ధి జోబైడెన్‌ గెలుపును సర్టిఫై చేశాయి. గత ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో ట్రంప్‌ గెలిచారు. విస్కాన్సిన్‌లో బైడెన్‌ 20,700 ఓట్లతో గెలిచినట్లు గవర్నర్‌ టోనీ ఎవర్స్‌ ప్రకటించారు. ఇటీవలే ఈ రాష్ట్రంలోని రెండు కౌంటీల్లో రీకౌంటింగ్‌ జరిపారు. అయితే ఈ ఫలితాన్ని ట్రంప్‌ అంగీకరించడం లేదు. మరోవైపు రిపబ్లికన్లకు బాగా పట్టున్న ఆరిజోనాలో బైడెన్‌ 10వేల ఓట్లతో గెలిచారని గవర్నర్‌ డగ్‌ హాబ్స్‌ తెలిపారు. ప్రస్తుతం బైడెన్‌కు ఎలక్టోరల్‌ కాలేజీలో 306 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఎన్నికల ఫలితాలను తిరస్కరించాలని ట్రంప్‌ లాయర్‌ రూడీ గిలియాని కోరారు. కానీ ఆయన డిమాండ్‌ ఎవరూ పట్టించుకోలేదు. వీరంతా తప్పుడు సర్టిఫికేషన్లు చేస్తున్నారని రూడీ చెప్పుకొచ్చారు. తాజా సర్టిఫికేషన్లను ఛాలెంజ్‌ చేసేందుకు ట్రంప్‌నకు ఐదు రోజుల సమయం ఉంది. తాను తనకు ఓటేసిన 7.4 కోట్ల మంది తరఫున పోరాడుతున్నానని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

 ఐరాస చీఫ్‌తో బైడెన్‌ చర్చలు 
న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనీ గుట్టెరస్‌తో అమెరికా ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ జోబైడెన్‌ చర్చలు జరిపారు. అమెరికాకు, ఐరాసకు మధ్య బంధం బలోపేతం చేయడం, ప్రపంచ సమస్యలను కలసికట్టుగా ఎదుర్కోవడంపై వీరిద్దరూ సోమవారం ఫోన్‌లో చర్చించారు. ఎన్నికల్లో తన విజయానికి అభినందనలు తెలిపినందుకుగాను ఆంటోనీకి బైడెన్‌ కృతజ్ఞతలు చెప్పారు. ఇథియోపియాలో హింస పెరగడంపై బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేశారని ఐరాస వర్గాలు తెలిపాయి. బైడెన్‌తో చర్చలపట్ల ఆంటోనీ సంతోషం వ్యక్తం చేశారన్నాయి. బైడెన్‌బృందంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారన్నాయి. ట్రంప్‌ హయంలో ఐరాసతో యూఎస్‌ సంబంధాలు పలు అంశాల్లో క్షీణించిన సంగతి తెలిసిందే. పలు కీలక ఐరాస సమాఖ్యలు, సంస్థల నుంచి యూఎస్‌ వైదొలిగేలా ట్రంప్‌ నిర్ణయాలు తీసుకున్నారు. డబ్లు్యహెచ్‌ఓ, పారిస్‌ ఒప్పందం, యునెస్కో, మానవహక్కుల సంఘం నుంచి యూఎస్‌ ట్రంప్‌ హయంలో బయటకు వచ్చింది. కాగా తిరిగి పారిస్‌ ఒప్పందంలో చేరతామని బైడెన్‌ ఇటీవల ప్రకటించారు.

మరిన్ని వార్తలు