స్తంభంపైకి ఎక్కిన ఎలుగుబంటి.. విద్యుత్​ అంతరాయం..

11 Jun, 2021 14:58 IST|Sakshi

వాషింగ్టన్‌: సాధారణంగా ఎలుగు బంట్లు అడవిలో ఉంటాయి. ఒక్కోసారి అడవిలో వాటికి ఆహారం దొరక్కగానీ లేదా దారి తప్పిగానీ మానవ ఆవాసాలలోకి ప్రవేశిస్తాయి. ఈక్రమంలో ఎలుగుబంట్లు మనుషులపైన దాడిచేసిన ఘటనలు కూడా కోకొల్లలు. అయితే, ఇక్కడ ఒక ఎలుగు బంటి అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతంలోని ఒక విద్యుత్​ స్తంభంపైకి ఎక్కి కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అమెరికాలోని దక్షిణ అరిజోనా, విల్కాక్స్​ పట్టణం కేంద్రంగా సల్ఫర్​ స్పింగ్​ వ్యాలీ ఎలక్ట్రిక్​ కో ఆపరేటివ్​ అనే సంస్థ ఉంది.  ఇది  ఆ ప్రాంతంలో విద్యుత్​ సరఫరా చేస్తుంది. ఈ సంస్థ కార్మికులు ఒక ఎలుగు బంటి విద్యుత్​ స్తంభం మీద ఉండటాన్ని గమనించారు. ఈ క్రమంలో ఆ సంస్థ​ కార్మికులు వెంటనే ఆ స్తంభానికి విద్యుత్​ సరఫరాను నిలిపివేశారు. ఆ తర్వాత ఒక పెద్ద క్రేన్​ను తెప్పించారు.

ఒక ఫైబర్​ గ్లాస్​ స్టిక్​తో దాన్ని అదిలించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ ఎలుగు బంటి మెల్లగా స్తంభం కిందకు దిగి, సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్​ అవుతోన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘ పాపం.. ఎలుగుబంటి తన వారికోసం పైకెక్కి చూస్తుంది..’, ‘అయ్యో.. ఎంత పెద్ద ఆపద తప్పిపోయింది..’, ‘ హయ్​.. మిత్రమా.. జాగ్రత్తగా దిగి నీ ఇంటికి వెళ్లిపో.. ’ ‘విద్యుత్​ కార్మికుల చేసిన పనికి హ్యట్సాఫ్​’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

చదవండి: వైరల్‌: చావు నుంచి తప్పించుకున్న మహిళలు

మరిన్ని వార్తలు