ఆర్మేనియా– అజర్‌బైజాన్‌ మధ్య ఘర్షణ 

29 Sep, 2020 07:57 IST|Sakshi

ఎరెవాన్‌: వివాదాస్పద నగొర్నొ–కరబక్‌ ప్రాంతంపై పట్టు కోసం ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ మధ్య ఆది, సోమవారాల్లో తీవ్ర ఘర్షణ జరిగింది. ఘర్షణలకు నువ్వంటే నువ్వు కారణమని ఇరు దేశాలు దుమ్మెత్తి పోసుకున్నాయి. దాదాపు చిన్నపాటి యుద్ధాన్ని తలపించే ఈ ఘర్షణల్లో ఇరుపక్షాల్లో కలిపి దాదాపు 20–30 వరకు మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. సోమవారం తర్‌తర్‌ నగరంపై ఆర్మేనియా ఆర్మీ కాల్పులు జరిపిందని అజర్‌బైజాన్‌ రక్షణ మంత్రి ఆరోపించారు. ప్రతిగా తాము జరిపిన ఎదురుకాల్పుల్లో దాదాపు 550 మంది ఆర్మేనియా సైనికులు మరణించారని చెప్పగా ఈ ఆరోపణలను, మరణాలను ఆర్మేనియా తోసిపుచ్చింది. (చదవండి: డ్రాగన్‌కు కౌంటర్‌ ఇచ్చేందుకు భారత్‌ సిద్ధం!)

కాగా ఘర్షణలకు దిగుతున్న ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ రెండింటితో భారత్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఘర్షణపై భారత్‌ ఆచితూచి స్పందించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అజర్‌బైజాన్, ఆర్మేనియా మధ్య ఎన్నో ఏళ్లుగా నగర్నొ–కబరక్‌ ప్రాంత ఆధిపత్యంపై ఘర్షణ జరుగుతూనే ఉంది. దట్టమైన అడవులు, పర్వతాలుండే ఈ ప్రాంతం ఇరుదేశాలకు మధ్యన ఉంది. పేరుకు ఈ ప్రాంతం అజర్‌బైజాన్‌ ఆధీనంలో ఉన్నట్లు చెబుతున్నా, పాలన రిపబ్లిక్‌ ఆఫ్‌ అర్ట్‌సక్‌ ప్రభుత్వం జరుపుతుంది.

మరిన్ని వార్తలు