బిల్‌ గేట్స్‌ను అరెస్ట్‌ చేయాల్సిందే.. మరీ ఇంత దారుణం చేశాడా?

30 May, 2021 18:33 IST|Sakshi

న్యూఢిల్లీ:  ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అరెస్ట్‌ చేయాలంటూ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ ట్రెండింగ్‌లో ఉంది. భారత్‌లో అమాయక గిరిజన బాలికలపై వ్యాక్సిన్లకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను తన సంస్థ ( బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌) తరపున అనధికారికంగా నిర్వహించారని , వాటికి  పెద్ద ఎత్తున నిధులను కూడా సమకూర్చారంటూ గ్రేట్‌గేమ్ ఇండియా ఒక ప్రత్యేక కథనం విడుదల చేసింది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన తరువాత నుంచి 'అరెస్ట్ బిల్ గేట్స్' అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్విటర్‌లో నెటిజన్ల పోస్ట్‌ చేయగా, ప్రస్తుతం అది ట్రెండింగ్‌లో ఉంది. మెలిండా  గేట్స్‌తో విడాకుల వ్యవహారం, మైక్రోసాఫ్ట్‌లోని ఒక మహిళా ఉద్యోగితో అతని అక్రమ సంబంధంపై వివాదంతో పాటు ప్రస్తుతం తాజా ఆరోపణలు చూస్తుంటే  బిల్ గేట్స్ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతున్నట్లు కనిపిస్తోంది.

 గ్రేట్‌గేమ్ ఇండియా రాసిన ప్రత్యేక కథనంలో..
 2009లో తెలంగాణ సహా నాగాలాండ్‌లోని గిరిజన బాలికలపైనా  అనాధికారంగా క్లినికల్ ట్రయల్స్ చేపట్టినట్లు ఆ సంస్థ పేర్కొంది. 14 వేల మంది కోయ గిరిజన తెగకు చెందిన 10 నుంచి 14 సంవత్సరాల్లోపు బాలికపై ఈ ప్రయోగాలు సాగాయని తన కథనంలో పొందుపరిచింది. అత్యంత వివాదాస్పదమైన గర్డాసిల్ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ ఆ బాలికలపై జరిపినట్లు తెలిపింది. ఆ వ్యాక్సిన్‌ హ్యూమన్‌పాపిలోమా వైరస్‌ను నివారించడానికి తయారు చేసింది. అమెరికాలోని సియాటెల్‌ ప్రధాన కేంద్రంగా దాదాపు అన్ని దేశాల్లోనూ విస్తరించి ఉన్న ఎన్జీఓ సంస్థ ప్రోగ్రామ్ ఫర్ అప్రాప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ (పాత్) ద్వారా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించినట్లు గ్రేట్‌గేమ్ ఇండియా స్పష్టం చేసింది.

ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం ఇంటికి దూరంగా వసతి గృహాల్లో నివసించే బాలికలను, పేదరికంలో ఉన్న వారినే ఎంచుకున్నట్లు తెలిపింది. ఈ ప్రయోగాలు వికటించడం వల్ల పలువురు గిరిజన బాలికలు దీర్ఘకాలిక అనారోగ్యానికి గురయ్యారని, కొందరు మరణించారని వివరించింది. తమ కుమార్తెకు గర్డాసిల్ అనే వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్ చేశారనే విషయం.. ఆ బాలిక తల్లిదండ్రులకు కూడా తెలియదని అంటున్నారు. ఇదే పరిస్థితి ఖమ్మం జిల్లా పలువురు గిరిజనుల్లో నెలకొని ఉందని పేర్కొంది. నాగాలాండ్‌లోని కొన్ని గిరిజన కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు అంచనా వేసింది. ఇటీవల వ్యాక్సిన్ ఫార్ములాను భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వకూడదంటూ గేట్స్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చదవండి: వీళ్లు కరోనా ఉన్నట్లు మరిచారేమో.. అందుకే ఇలా?
 

మరిన్ని వార్తలు