పక్షవాత బాధితునికి ఏఐ సాయం... అతనిలో వచ్చిన వినూత్న మార్పు ఇదే..

28 May, 2023 10:05 IST|Sakshi

ఇది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యుగం. ఇంతకాలం అసాధ్యాలనుకున్నవన్నీ ఏఐ సాయంతో సుసాధ్యాలవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఏఐ ఉపయోగానికి సంబంధించిన కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అటువంటి మరో ఉదంతం ఇప్పుడు అందరినీ తనవైపు తిప్పుకుంటోంది.స్విట్టర్లాండ్‌ శాస్త్రవేత్తలు తాజాగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో పక్షవాతానికిగురైన ఒక వ్యక్తికి అత్యుత్తమ చికిత్సనందించారు.

బాధితుని శరీరంలోని కిందిభాగం పక్షవాతానికి గురికాగా, శాస్త్రవేత్తలు ఆ భాగం బాధితుని నియంత్రణలోకి వచ్చేలా చేశారు. వివరాల్లోకి వెళితే 2011లో పక్షవాతానికి గురైన గర్ట్‌-జైన్‌ ఓస్కమ్‌ అనే వ్యక్తి ఇప్పుడు ఏఐ సాయంతో తిరిగి నడవగలుగుతున్నాడు. తనకు చికిత్స అందించిన శాస్త్రవేత్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. 40 ఏళ్ల ఓస్కమ్‌ తన ఆలోచనల ద్వారా ఇప్పుడు తన శరీరభాగాలను నియత్రించగలుగుతున్నాడు. రెండు ఇంప్లాట్స్‌ కారణంగా ఇది సంభవమయ్యింది. బాధితుని మెదడు- వెన్నెముకకు మధ్య తిరిగి కనెక్షన్‌ ఏర్పరచడం ద్వారా బాధితుని శరీర భాగాలు అతని అదుపులోకి వచ్చాయి.

ఓస్కమ్‌ మీడియాతో మాట్లాడుతూ తాను తిరిగి నడుస్తానని ఎప్పుడూ అనుకోలేదని,శాస్త్రవేత్తలు తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని అన్నారు. ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకుల బృందం ఓస్కామ్‌ మెదడుకు, వెన్నెముకకు మధ్య ఒక డిజిటల్‌ బ్రిడ్జి ఏర్పాటు చేసింది.ఈ బ్రిడ్జి బాధితుడు అన్ని ఆటంకాలు అధిగమించి నడించేందుకు సహకరిస్తుంది. 2011లో జరిగిన ఒక ప్రమాదం అనంతరం ఓస్కమ్‌ పక్షవాతానికి గురయ్యాడు. ఆ తరువాత నుంచి వ్యాధితో బాధపడుతూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏఐ సాయం, శాస్త్రవేత్తల కృషితో బాధితుడు తిరిగి నడవగలుగుతున్నాడు. 

మరిన్ని వార్తలు