Aston University: వైరస్‌కు ప్రతి సృష్టి!

22 Jan, 2023 05:34 IST|Sakshi

లండన్‌: మానవ చరిత్రలో తొలిసారిగా వైరస్‌కు కంప్యూటర్‌ సాయంతో యథాతథంగా ప్రతి సృష్టి చేశారు! గతంలోనూ ఇలాంటివి జరిగినా జీవపరంగా, 3డి నిర్మాణపరంగా, జన్యుపరంగా ఓ వైరస్‌ను అచ్చుగుద్దినట్టుగా పునర్నిర్మించడం ఇదే తొలిసారట! బ్రిటన్లోని ఆస్టన్‌ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మ్యాథమెటిక్స్‌ ప్రొఫెసర్‌ ద్మిత్రీ నెరుక్‌ ఈ ఘనత సాధించారు! అత్యాధునిక సూపర్‌ కంప్యూటర్లు వాడినా కూడా ఈ పరిశోధనకు ఏకంగా మూడేళ్లు పట్టిందట!

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైరస్‌ నిర్మాణాలను క్రయో ఎలక్ట్రాన్‌ మైక్రోస్కొపీ, కంప్యుటేషనల్‌ మోడలింగ్‌ సాయంతో పరిశీలించారు. ‘‘ఇంతకాలం పాటు వైరస్‌ల పూర్తి జన్యు నిర్మాణక్రమం అందుబాటులో లేని కారణంగా వాటి తాలూకు జీవక్రియలపై మనకు సంపూర్ణ అవగాహన లేదు. తాజా అధ్యయనం ఈ విషయంలో దారి చూపగలదు’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘అంతేగాక ఈ పరిశోధన వల్ల యాంటీబయాటిక్స్‌కు మెరుగైన, సమర్థమైన ప్రత్యామ్నాయాల దిశగా కొత్త దారి దొరుకుతుంది. యాంటీబయాటిక్స్‌కు లొంగని మొండి బ్యాక్టీరియా సమస్యకూ పరిష్కారం లభిస్తుంది’’ అని వారంటున్నారు. ఈ అధ్యయనం ఫారడే డిస్కషన్స్‌ జర్నల్‌లో పబ్లిషైంది.

మరిన్ని వార్తలు