డయాలసిస్‌ పేషెంట్లకు ఆక్స్‌ఫర్డ్‌ టీకా

5 Jan, 2021 05:00 IST|Sakshi
ఆక్స్‌ఫర్డ్‌ టీకా పొందుతున్న 82 ఏళ్ల బ్రియాన్‌

యూకేలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా కలిసి తయారు చేసిన కోవిడ్‌–19 టీకా వ్యాక్సినేషన్‌ ప్రపంచంలోనే ప్రప్రథమంగా సోమవారం యూకేలో మొదలైంది. డయాలసిస్‌ పేషెంట్లకు ముందుగా ఈ టీకాను ఇస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌లో డయాలసిస్‌ రోగి బ్రియాన్‌ పింకెర్‌(82)కు మొదటగా టీకా వేశారు. టీకా తయారీలో కీలక పాత్ర పోషించిన ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఆండ్రూ పొలార్డ్‌ కూడా మొదటగా టీకా తీసుకున్న వారిలో ఉన్నారు.

‘ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ తయారీ బ్రిటిష్‌ సైన్స్‌ సాధించిన ఘన విజయం. ఈ విజయంలో పాలుపంచుకున్న అందరికీ ధన్యవాదాలు’అని యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. పరిశీలన నిమిత్తం ఆక్స్‌ఫర్డ్‌ టీకాను కొద్ది డోసుల్లో ముందుగా పంపిణీ చేస్తారు. వారం తర్వాత భారీ మొత్తంలో దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నారు. ఇందుకోసం 700 వ్యాక్సినేషన్‌ కేంద్రాలను తెరుస్తారు. జాతీయ ఆరోగ్య సేవల సిబ్బందికి కరోనా కొత్త వేరియంట్‌తో ముప్పు పొంచి ఉందని ఆరోగ్య మంత్రి మ్యాట్‌ హాంకాక్‌ తెలిపారు. మాస్క్‌ ధరించడం, పరిశుభ్రత పాటించడం వంటివి తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరారు. యూకే ప్రభుత్వం ఇప్పటికే ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ టీకాకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ఫైజర్‌ టీకా మొదటి డోసును 10 లక్షల మంది ఆరోగ్య సేవల సిబ్బందికి అందజేశారు. రెండో డోసు కూడా త్వరలోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైజర్‌ టీకాతో పోలిస్తే ఆక్స్‌ఫర్డ్‌ టీకా తరలింపు, నిల్వ చాలా తేలిక. ఫైజర్‌ టీకాలను –70 డిగ్రీల వద్ద నిల్వ ఉంచాల్సి ఉంటుంది. ఆక్స్‌ఫర్డ్‌ టీకాను కోవిషీల్డ్‌ పేరుతో భారత్‌లోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకాల అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం ఇటీవలే అనుమతి మంజూరు చేసింది. కాగా, కరోనా కొత్త వేరియంట్‌ యూకేలో శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వరుసగా ఆరు రోజులుగా 50వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి.

స్కాట్లాండ్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలు
లండన్‌: కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ బాధితులు, మృతుల సంఖ్య పెరిగిపోతుండటంతో స్కాట్లాండ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ ప్రకటించింది. అత్యవసరాలకు తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్కాట్లాండ్‌ ఫస్ట్‌మినిస్టర్‌ నికోలా స్టర్జియన్‌ ప్రజలను కోరారు. బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ బ్రిటన్‌లో మరిన్ని ఆంక్షలు విధిస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో స్కాటిష్‌ పార్లమెంటు సోమవారం అత్యవసర సమావేశం జరిపి లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంది.

యూకేలో మరిన్ని ఆంక్షలు
దేశంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ ప్రకటించారు. దేశవ్యాప్త పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలంటూ యూకే ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్న నేపథ్యంలో జాన్సన్‌ సోమవారం ఈ ప్రకటన చేశారు. యూకేలో చాలా ప్రాంతాలు ఇప్పటికే టయర్‌–4 ఆంక్షల కింద ఉన్నాయి. వైరస్‌ కొత్త వేరియంట్‌ బయటపడిన తర్వాత 28 రోజుల్లో యూకేలో 454 మంది కోవిడ్‌తో చనిపోయారు. ఇలా ఉండగా, దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా వైరస్‌.. యూకే వేరియంట్‌ కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు